Begin typing your search above and press return to search.

ఓటీటీలోనే తండ్రీకొడుకుల క్రేజీ మల్టీస్టారర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   24 Jan 2022 10:46 AM GMT
ఓటీటీలోనే తండ్రీకొడుకుల క్రేజీ మల్టీస్టారర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ - తనయుడు ధృవ్ విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ మల్టీస్టారర్ ''మహాన్''. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విక్రమ్ కెరీర్ లో వస్తున్న 60వ సినిమా కావడం.. తండ్రీకొడుకులు తొలిసారి కలిసి నటించిన మూవీ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే గత కొద్దిరోజులుగా వైరస్ మళ్ళీ విజృంభిస్తుండటం.. పలు రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో 'మహాన్'' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

'మహాన్' సినిమాని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. తమిళంతో పాటుగా తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలతో విక్రమ్ తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు తనయుడుతో కలిసి నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

కాగా, 'మహాన్' చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారని సమాచారం. ఇందులో విక్రమ్ - ధృవ్ విక్రమ్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని తెలుస్తోంది. వాణి భోజన్ - సిమ్రాన్ - బాబీ సింహా - సంతానం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు. వివేక్ హర్షన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

''మహాన్'' సినిమా విక్రమ్ కెరీర్ లో ఫస్ట్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాగా.. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుకు రెండోది. కార్తీక్ సుబ్బరాజు గత చిత్రం 'జగమే తంత్రం' కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విక్రమ్.. ఈసారి కొడుకుతో కలిసి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.