డార్లింగ్ రాకుంటే టవర్ పైనుంచి దూకేస్తాడట!

Wed Sep 11 2019 15:54:17 GMT+0530 (IST)

Fan climbs cell tower demanding a talk with Prabhas

సినీ..క్రీడాస్టార్లకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాము విపరీతంగా అభిమానించి.. ఆరాధించే వారి కోసం చేసే ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. అయితే..  ఈ అభిమానం హద్దుల్లో ఉంటే ఇబ్బందేమీ ఉండదు. కానీ.. అది కాస్తా ఓవర్ అయిన కొద్దీ సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పవు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.జనగామకు చెందిన ఒక యువకుడికి డార్లింగ్ ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టం. తానెంతగానో అభిమానించే అభిమాన నటుడు తనను చూసేందుకు రావాలంటూ సెల్ టవర్ ఎక్కేశాడు. తనను చూసేందుకు ప్రభాస్ రాకుంటే.. పైనుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాడు.

జనగామ జిల్లా యశ్వంత్ పుర లోని పెట్రోల్ బంక్ పక్కనున్న రిలయన్స్  సెల్ టవర్ పైకి ఎక్కిన గుగులోతు వెంకన్న అనే వీరాభిమాని చేసిన ఈ చేష్టను పలువురు తప్పు పడుతున్నారు.  తనను చూసేందుకు ప్రభాస్ వెంటనే రావాలని.. లేకుంటే కిందకు దూకేస్తానంటూ అతగాడి బెదిరింపు ఏ మాత్రం సరికావంటున్నారు.

ఎంత అభిమానమైతే మాత్రం.. సెల్ టవర్ ఎక్కేసి.. కిందకు దూకేస్తానంటూ బెదిరించటం ఏమిటంటూ స్థానికులు బ్రతిమిలాడుతున్నారు. కిందకు దిగాలని కోరుకుంటున్నారు. ఎక్కడో ఉన్న ప్రభాస్.. ఈ ఉన్మాద వీరాభిమాని డిమాండ్ కు తలొగ్గి జనగామకు వెళతాడా ఏంటి?  ఇంతకీ.. తన అభిమాని చేసిన పిచ్చి పని గురించి డార్లింగ్ కు సమాచారం అంది ఉంటుందా?