సిరివెన్నెల ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల స్పందన

Sun Nov 28 2021 11:10:04 GMT+0530 (IST)

Family members response to Sirivennela health

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి ఆయన్ను తరలించి చికిత్స చేయిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా వార్తలు బయటకు వచ్చాయి. రెండు రోజులకు పైగానే ఆయన ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందారు. మొదట ఈ విషయమై మీడియాకు ఎలాంటి సమాచారం లేదు. కాని ఇండస్ట్రీ వర్గాల వారికి తెలియడంతో  మీడియా వర్గాలకు కూడా విషయం పొక్కింది. దాంతో సిరివెన్నెల ఆరోగ్యం విషయమై నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. వారు స్పందిస్తూ.. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని.. ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్సను వైధ్యులు అందిస్తున్నారు. అతి త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ మన ముందుకు ఆయన వస్తారు. ఆయన మునుపటి ఉత్సాహంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే నమ్మకంను వారు వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమలో పాటల రచయితలు అంటే ముందు వినిపించే పేర్లలో ఖచ్చితంగా సిరివెన్నెల పేరు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన కలం నుండి ఎన్నో అద్బుతమైన పాటలు వచ్చాయి. ఇప్పటి వరకు మూడు వేల పాటలు ఆయన కలం నుండి వచ్చాయి. ఆ పాటలు ఎన్నో అద్బుత రికార్డులను సొంతం చేసుకున్నాయి. మనసుకు హత్తుకునే పాటలు మాత్రమే కాకుండా ప్రేమను అద్బుతంగా తెలిపే పాటలు.. గుండెలను పిండేసే పాటలు.. ఆలోచన కలిగించే పాటలు ఇలా ఎన్నో రకాల పాటలను ఆయన ప్రేక్షకులకు అందించాడు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం.