Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్ 2' వివాదం: బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన ప్రముఖ దర్శకుడు

By:  Tupaki Desk   |   9 Jun 2021 10:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం: బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన ప్రముఖ దర్శకుడు
X
అగ్ర కథానాయిక సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్‌ సిరీస్‌ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే ఈ సిరీస్‌ ట్రైలర్ చూసిన కొందరు.. తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం విదితమే. షో స్ట్రీమింగ్ అయిన తరువాత ఐదు రోజుల పాటు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవటంతో.. అంతా సద్దు మనిగినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వివాదం మొదలైంది. ఈసారి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సిరీస్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లో తమిళుల టైగర్స్ ను తప్పుగా చూపించారని.. ఎల్టీటీఈ సోల్జర్స్ మందు తాగినట్టుగా చూపించారని.. ఐఎస్‌ఐఎస్‌ తో ఎల్టీటీఈ సంబంధాలు పెట్టుకున్నట్టు చూపించారంటూ ఆందోళనకారులు విమర్శలు చేస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్ 2' స్ట్రీమింగ్ ఆపకపోతే అమెజాన్‌ ప్రైమ్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విష‌యంపై తమిళ సీనియర్‌ దర్శకుడు భారతీరాజా స్పందించారు. తమిళులకు వ్యతిరేకంగా ‘ఫ్యామిలీ మెన్‌ 2’ వెబ్‌ సిరీస్ రూపొందింద‌ని.. దాన్ని ప్రసారం చేయకూడద‌ని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప‌ట్టించుకోకపోవ‌డం బాధాకరమని భారతీరాజా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తమిళ ద్రోహులు రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌ పై ఇప్పటికైనా కేంద్రం నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

అలానే ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ వివాదంపై తమిళ నటుడు మనోబాల స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌ తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందని అన్నారు. ''ఇందులో నటించినందుకు సమంత తప్పకుండా క్షమాపణలు చెప్పాలి. రాజీ పాత్ర విషయంలో మేకర్స్ సమంత ను మోసం చేశారు. ఒక పోరాటయోధురాలిగా ఈ పాత్ర గురించి ఆమెకు చెప్పినప్పటికీ.. తమిళ ఈలం పోరాటం క్షీణత తెలియజేసే విధంగా దీన్ని చిత్రీకరించారు. ఇలాంటి కథను ఒప్పుకునే ముందు సమంత కాస్త ఆలోచించాల్సింది. సమంత క్షమాపణలు చెప్పినా సరే.. చిత్ర బృందం పూర్తి బాధ్యత తీసుకునే వరకూ సిరీస్‌ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం'' అని మనోబాల తెలిపారు. మరి ఈ వివాదంపై 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.