యాక్షన్ VFx లేకుండా F3 తో ఫన్ రిలీఫ్?

Mon May 23 2022 22:00:02 GMT+0530 (IST)

F3 without Action VFx?

ఇటీవలి కాలంలో 'పాన్ ఇండియా మానియా' ఊపేస్తోంది. ఏ సినిమా రిలీజవుతున్నా దానికి పాన్ ఇండియా ట్యాగ్ తగిలించేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 సంచలన విజయాలు అంతటి స్ఫూర్తిని రగిలించాయి. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో అసాధారణ వీ.ఎఫ్.ఎక్స్ మాయాజాలంతో తెరకెక్కినవి.  భారీ యాక్షన్ నేపథ్యం .. లార్జర్ దేన్ లైఫ్ హీరోయిజం తెరపై అద్భుతంగా పండిన సినిమాలివి.అయితే ఇలాంటివేవీ లేకుండా రెగ్యులర్ సోషల్ కాన్సెప్టుతో ఫన్ కామెడీ రొమాన్స్ ఎలిమెంట్స్ తో వచ్చే లైటర్ వెయిన్ సినిమాలేవీ ఇటీవల కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు వస్తున్న ఎఫ్ 3 ఎలాంటి విజయం దక్కించుకోనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

F3 ఆడియెన్ కి ఎలాంటి రిలీఫ్ నిస్తుంది?  వీ.ఎఫ్.ఎక్స్ మానియా కానీ భారీ యాక్షన్ హంగామా కానీ లేకుండా ఇది ఆడియెన్ ని ఏ మేరకు మెప్పించనుంది? అన్నది చర్చకు వస్తోంది. ఎఫ్ 2 తరహాలోనే మరోసారి అనీల్ రావిపూడి మ్యాజిక్ వర్కవుటై హిట్టు పవనాలు వీస్తాయా? అంటూ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ప్రచారంలో కూడా రావిపూడి టీమ్ బోలెడంత ఫన్ తో హంగామా చేస్తోంది. కానీ కంటెంట్ ఏమిటీ అన్నది మాత్రం అంతగా వైరల్ కావడం లేదు. ఇక వెంకీ మామ కామిక్ టైమింగ్ అద్భుత నటనకు వరుణ్ తేజ్ మార్క్ కామెడీ ని జోడించి తమన్నా - మెహ్రీన్ గ్లామర్ ని రంగరించి దేవీశ్రీ మ్యూజిక్ తో రావిపూడి హిట్టు కొట్టేస్తాడా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఎఫ్ 3 ఈనెల 27న అత్యంత భారీగా విడుదల కానుంది.

ఫన్ మ్యాజిక్ తో పాటు సామాజిక సమస్య..?

ఆద్యంతం కామెడీ టింజ్ తో బోలెడంత నవ్వులు అల్లరి సృష్టించవచ్చని ఎఫ్ 2తో నిరూపించారు రావిపూడి. ఈసారి ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న ఎఫ్ 3 కథాంశం ఎలా ఉండనుంది? అంటే అంతకుమించిన పాయింట్ నే దర్శకుడు ఎంచుకున్నారు. సహజంగానే మధ్యతరగతి కుటుంబం కథలు డబ్బు చుట్టూ తిరుగుతాయి. ఏదీ సరిగా సమకూరదు. డబ్బు లేనిదే ఏదీ లేదు! అనుకునే మెంటాలిటీ పుట్టేది మధ్యతరగతిలోనే.

పేద దిగువ తరగతుల్లో ఫీలింగ్స్ ఆలోచనలతో పోల్చినా .. ధనిక వర్గాల ఆలోచనను మైండ్ సెట్ ని పరిశీలించినా అక్కడ కనిపించనిది మధ్యతరగతిలో కనిపిస్తుంది. డబ్బు వెంట పడే క్రమంలో బోలెడన్ని సరిగమలు ఉంటాయి. ఒడిదుడుకులు ఎత్తు పల్లాలు కష్టాలు కల్లోలాలు వివాదాలు ఇలా ఇన్నిటినీ యాడప్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్ 3లో వీటన్నిటినీ అనీల్ రావిపూడి చూపిస్తున్నాడని టాక్.

ఇది సీక్వెల్ కథ కాదు! అని అనీల్ రావిపూడి ఇంతకుముందే చెప్పారు. ఎఫ్ 3 కథాంశం పూర్తిగా నూతనంగా ఉంటుంది. కొత్త టింజ్ తో డబుల్ కామెడీ డబుల్ డోస్ తో ఉంటుందని వెల్లడించారు. F3 అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం వేసవి సెలవుల సందర్భంగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. F3 లోనూ కామన్ ఎలిమెంట్ తెలుగు మధ్యతరగతి మహిళలను టార్గెట్ చేయడమేననేది తాజా గుసగుస. భార్యలు అత్తమామలపై దృష్టి సారించి అనిల్ ముందుగా F2 తో చక్కని ఆహ్లాదకరమైన కామెడీ అందించి హిట్టు కొట్టాడు.

F3లో అంతకుమించి ట్రీటిస్తాడట. అయితే ఈసారి అనిల్ మహిళలను టార్గెట్ చేయడం కంటే.. అందుకు కారణాలపై గురి పెట్టాడట.  చివరికి ఆడాళ్లకు అనుకూలంగా సందేశం ఇవ్వనున్నాడు. ఎఫ్ 3 మొత్తం కేవలం డబ్బు చుట్టూనే తిరుగుతుందని కథనాలు వస్తున్నాయి. లబ్బు డబ్బు పాట ఇప్పటికే హింట్ ఇవ్వగా.. మధ్యతరగతి కుటుంబాలు డబ్బుల వెంట పరుగెత్తితే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకున్నారని తెలుస్తోంది.

ఆడాళ్లపై సెటైర్లు వేయడం సరికాదు కానీ.. దానికి కారణాలపై వేస్తే తప్పేమీ లేదని అర్థం చేసుకోవాలి. ఈసారి అనిల్ మధ్యతరగతి డబ్బు మనస్తత్వాన్ని .. ధనవంతులు పేదలను ఎలా దోపిడి చేస్తారో కూడా తెరపై చూపిస్తారట. అద్భుత నటీనటులతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే నవ్వుల అల్లరిని సృష్టించే ఎలిమెంట్ ఇదన్న టాక్ వినిపిస్తోంది. వెంకటేష్- వరుణ్ తేజ్ పార్ట్ 1లో బ్లాస్ట్ అయ్యేలా బోలెడన్ని నవ్వుల్ని పండించారు. వీరికి సునీల్ లాంటి కమెడియన్ యాడైతే మరో లెవల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. గ్లామర్ కంటెంట్ లో తమన్నా - మెహ్రీన్ అదరహో అనిపిస్తారు.