నా సత్తా ఏంటో ఆ మూవీతోనే అందరికి తెలిసింది: తమన్నా

Mon Aug 15 2022 19:00:01 GMT+0530 (IST)

Everyone knew what I was capable of with that movie: Tamannaah

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. 2005లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'శ్రీ' మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తమ్మన్నా.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. దాదాపు 17 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఈ ముద్దుగుమ్మ.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను ముందుకుసాగిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ 'ఎఫ్ 3'తో ప్రేక్షకులను పలకరించింది.విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' సత్యదేవ్ సరసన 'గుర్తుందా శీతాకాలం' చిత్రాలు చేస్తోంది.

వీటిలో 'గుర్తుందా శీతాకాలం' ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అలాగే మరోవైపు బాలీవుడ్ లో ఈమె నటించిన 'బాబ్లీ బౌన్సర్' విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో మిల్కీ బ్యూటీ లేడీ బౌన్సర్ గా అలరించబోతోంది. నార్త్ ఇండియాలో రియల్ బౌన్సర్ టౌన్ అయినా అసోలా ఫతేపూర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుంది. సెప్టెంబర్ 23న హిందీ తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ ముస్తాబవుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. బాబ్లీ బౌన్సర్ లో బలమైన స్త్రీ పాత్ర ఉంటుందని సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేసింది. అలాగే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి సినిమా గురించి ప్రస్తావిస్తూ.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'బాహుబలి' అన్ని వైపుల నుంచి తలుపులు తెరిచి తన కెరీర్ కు ఎంతగానో సహాయపడిందని ఆమె పేర్కొంది. అలాగే పక్కింటి అమ్మాయిగా కాకుండా నటిగా తన సత్తా ఏంటో అందరూ గ్రహించేలా చేసింది కూడా ఈ సినిమానే అంటూ తమన్నా స్పష్టం చేసింది. దీంతో ఈమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.