'అంటే సుందరానికీ!'.. 'ఎంత చిత్రం' గీతం ఎంత బాగుందో..!

Mon May 09 2022 19:04:24 GMT+0530 (India Standard Time)

Entha Chitram Lyrical From Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని - మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''అంటే.. సుందరానికీ!". మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాని తెరకెక్కించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే 'అంటే సుందరానికీ!' నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే వివేక్ సాగర్ కంపోజిషన్ లో వచ్చిన 'పంచెకట్టు' ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'ఎంత చిత్రం' అనే మరో సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'ఎంత చిత్రం.. ఎంత చిత్రం.. ఎన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా.. ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా..' అంటూ సాగిన ఈ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. ప్రేమలో మినిగి తేలుతున్న హీరోహీరోయిన్ల మధ్య భావాలను ఈ పాట రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో నాని - నజ్రియా మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూడొచ్చు. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ మెలోడియస్ ట్యూన్ కు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి - కీర్తన కలిసి ఈ గీతాన్ని ఆలపించారు.

'అంటే సుందరానికి' చిత్రంలో సుందర్ ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని నటిస్తుండగా.. నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనుంది. వీరిద్దరి మధ్య ఆహ్లాదకరమైన ప్రేమ కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సీనియర్ నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ నిర్మాతలు నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్ గా వర్క్ చేయగా.. లతా నాయుడు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

'అంటే సుందరానికీ' సినిమా మూడు భాషల్లో జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‪ గా థియేటర్ లలోకి రాబోతోంది. తమిళ్‪ లో 'అడాడే.. సుందరా'.. మలయాళంలో 'ఆహా.. సుందరా' టైటిల్స్‪ తో ఈ సినిమా రిలీక్ కాబోతోంది.