మెగాస్టార్ సీసీసీ-ఆక్సిజన్ బ్యాంకులకు రాని ప్రచారం `మా` ఎన్నికలకు ఎందుకు?

Wed Jun 23 2021 23:00:01 GMT+0530 (IST)

Elections for 800 people

దేశంలో సార్వత్రిక ఎన్నికలొస్తే ఆ హడావుడికి ఓ అర్థం ఉంది. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల కోసం పార్టీలు హడావుడి చేసినా దానికి కూడా మీనింగ్ ఉంది. కానీ ఇక్కడేంటి కేవలం 800 మంది మెంబర్లు ఉండే `మా` అసోసియేషన్ కి అంతటి రాజకీయ ప్రాధాన్యత? అంతా కలిసి కట్టుగా ఉండాల్సిన ఆర్టిస్టుల సంఘంలో ఎందుకీ గడబిడలు?  సినీపెద్దలు తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటే సరిపోతుంది కదా?  ప్రస్తుతం టాలీవుడ్ సహా కామన్ జనాల్లోనూ సర్వత్రా ఇదే డిబేట్ కొనసాగుతోంది. మెగాస్టార్ సీసీసీ-ఆక్సిజన్ బ్యాంకులకు లేని ప్రచారం `మా` ఎన్నికలకు ఎందుకు?తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ కి యూనియన్లు ఉన్నాయి. అయితే వీటికి అధ్యక్షులు ఎవరో కూడా ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎలెక్షన్స్ వస్తే మాత్రం హడావుడి ఒక హద్దులు దాటి కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే కాంట్రవర్సీలతో ఎన్నికైన కమీటీల మధ్య పొరపొచ్చాలతో ఈ అసోసియేషన్ మీడియాకి టీఆర్పీగా మారుతోంది.

మా ఎన్నికల గురించి పెద్ద పత్రికల్లో పెద్ద ఆర్టికల్స్.. ఎన్నికల గొడవలన్నీ టీవీ చానెళ్లలో కవరేజీలు అబ్బో బోలెడంత హంగామా.. కనీసం వేలాది మంది ఉండే ఒక నగరానికి ఎలక్షన్ వచ్చినా దానిదేముందిలే అనుకోవచ్చు. కేవలం 800 మంది కోసం ఇంత హంగామానా? ముఖ్యంగా మా అసోసియేషన్ లో గత ఆరేళ్లుగా ఈ రచ్చ మరీ ఎక్కువైపోతోంది.  నటకిరిటీ రాజేందర్ ప్రసాద్ మా ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గినప్పటి నుంచి మా ఎన్నికలపై ప్రతిసారీ మీడియా ఎటెన్షన్  ఎక్కువైంది.

ఈసారి మా అధ్యక్షపదవి రేసులో నటుడు ప్రకాశ్ రాజ్ ఓ వైపు ఉంటే.. మరోవైపున విష్ణు మంచు ఉన్నారు. ఇద్దరికి జనాల్లో మంచి పేరు ఉంది. అయితే ఇద్దరు కూడా మా సభ్యత్వం ఉన్న వారికి కావాల్సిన వారే కాగా వార్ మాత్రం పరాకాష్టకు చేరనుంది. మా కొత్త అధ్యక్షుడు ఎవరు? అన్నది ఇంకా తేలని వ్యవహారం. విష్ణు ప్రస్తుతం లైమ్ లైట్ లో ఉన్న నిర్మాతగా ఓట్లు తన ఖాతాలో వేసుకుంటారా? ఒక సీనియర్ గా కష్టం నష్టం తెలిసిన నటుడిగా ప్రకాష్ రాజ్ రేసులో నిలుస్తారా?  లేక జీవిత.. హేమ కూడా తమ సత్తా చాటుతారా? ఇలా డిబేట్లు చానెళ్లు పత్రికల్లో వేడెక్కించేస్తున్నాయి.

ఏదేమైనా మీడియాకి మాత్రం ఇటీవల కాస్త పెద్ద పని తగిలిందని వ్యంగ్యబాణాలు విసిరేస్తున్నారు నెటిజనులు. మా ఎన్నికలకు ఇచ్చే కవరేజీ టైమ్ స్లాట్లు ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తే ఆ ఛానల్ సొసైటికి మంచి చేసిందనే సింపథీ పెరుగుతుందేమో!! అంటూ పంచ్ లు వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ప్రారంభించి సేవలు చేసినప్పుడు.. ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించి కరోనా రోగుల ప్రాణాల్ని కాపాడినప్పుడు రాని కవరేజీ `మా ఎన్నికలకు ఎందుకు? అన్న చీవాట్లు కూడా పడిపోతున్నాయ్!!