118 నిర్మాతకు అంత ధైర్యమా?

Wed Sep 11 2019 20:00:01 GMT+0530 (IST)

East Coast Productions acquires Telugu rights of Vijay  Bigil

ఇలయదళపతి విజయ్ కి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పాల్సిన పనేలేదు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ తమిళంలో అతడికి ఉంది. అయినా ఏం లాభం?  కేవలం ఆ రాష్ట్రం వరకే అతడి పాపులారిటీ పరిమితమైంది. విజయ్ చాలా కాలంగా తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టాలని చూసినా ఎందుకనో ఆ రేస్ లో మాత్రం నెగ్గుకు రాలేకపోయాడు. రజనీకాంత్- కమల్ హాసన్- అజిత్ లాంటి స్టార్లకు వచ్చినంత పాపులారిటీ అతడికి రాలేదన్నది వాస్తవం. విజయ్ నటించిన `తుపాకి` తమిళంలో బ్లాక్ బస్టర్. కానీ తెలుగులో ఆశించినంత ఆడలేదు. మంచి సినిమా అన్నారు కానీ జనాలు చూడలేదు.ఇక రాజా రాణి ఫేం అట్లీతో కలిసి విజయ్ రెండు సినిమాలు చేశాడు ఇప్పటికే. మెర్సల్ - అదిరింది పేరుతో.. తేరి చిత్రం పోలీస్ పేరుతో తెలుగులో రిలీజయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మెర్సల్ కమర్షియల్ గా ఎంతో బావుందని టాక్ వచ్చినా జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయారన్న ముచ్చట సాగింది ట్రేడ్ లో. అయితే విజయ్- అట్లీ కాంబినేషన్ లేటెస్ట్ మూవీ `బిగిల్` ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కుల్ని 118 నిర్మాత ఛేజిక్కించుకున్నారు. తమిళంలో ఏజీయస్ అధినేత కల్పాతి అఘోరామ్ నిర్మించారు. తెలుగులోకి అనువదించి టైటిల్ ని నిర్ణయించి.. దీపావళికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

అయితే బిగిల్ పప్పులు తెలుగులో ఎంతవరకూ ఉడుకుతాయి? అన్నది ఇప్పుడే చెప్పలేం. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. అయితే ఈ తరహా సినిమాలకు జనాల్లో మౌత్ టాక్ బావుంటే తప్ప ఎక్కించడం కష్టం. విజయ్ సినిమాల గతానుభవాల దృష్ట్యా ప్రచారం పరంగా హైప్ తేలేకపోయినా జనాల్ని థియేటర్లకు రప్పించడం కష్టం. ఇంతకుముందు 118 చిత్రానికి కథ బావుందని క్రిటిక్స్ ప్రశంసించినా జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయారు. మరి ఈసారి ఏం చేస్తారు? అన్నది చూడాలి.