Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: కొండను తవ్వారు సరే.. ఒక్క ఎలుకనైనా పట్టుకున్నారా..?

By:  Tupaki Desk   |   24 Sep 2021 7:30 AM GMT
డ్రగ్స్ కేసు: కొండను తవ్వారు సరే.. ఒక్క ఎలుకనైనా పట్టుకున్నారా..?
X
టాలీవుడ్ లో మరోసారి తెరపైకి వచ్చిన సినీ తారల డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. 2017లోని కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో 12 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మెుదలుకొని హీరో తరుణ్ వరకు అందరినీ సుదీర్ఘంగా ప్రశ్నించారు అధికారులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు డ్రగ్ సప్లయిర్ కెల్విన్ సహా ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ ఆరా తీసింది. విచారణ ముగియడంతో ఈడీ ఈ కేసులో ఏమి తేలుస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని టాక్ వినిపిస్తోంది. కెల్విన్ తో పాటు ఇతర డ్రగ్ పెడ్లర్ల సమక్షంలో సినీ ప్రముఖులను విచారించినా.. ఎలాంటి ఆధారం దొరకలేదట. అందుకే ఎవరినీ మలివిడత విచారణకు రమ్మని చెప్పలేదని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. నాలుగేళ్ళ క్రితమే వారి నుంచి శాంపిల్స్ తీసుకున్న ఎక్సైజ్ శాఖ.. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపింది.

అంతేకాదు సినీ ప్రముఖులకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్న దానికి ఆధారాలు లేవని.. కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని.. దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని.. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్ వాంగ్మూలం మాత్రమే సరిపోదని.. అందులోను సెలబ్రిటీలు వద్ద ఎలాంటి డ్రగ్స్ కూడా లభించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో ఈడీ చేసేది ఏమీ లేకుండా పోయిందట.

సినీ ప్రముఖులు అసలు డ్రగ్స్ వాడలేదని ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పినప్పుడు.. డ్రగ్స్ క్రయవిక్రయాలు జరిగాయని ఎలా నిరూపించాలన్నది ఈడీ అధికారులకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయరంగు పులుముకుంటుందనుకున్న డ్రగ్స్ కేసులో ఈడీ చేసేదేమీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని కామెంట్స్ వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఊపిరి పీల్చుకున్నట్లే. మరి ఈడీ ఈ కేసులో ఎలాంటి నివేదిక సమర్పిస్తుందో చూడాలి.