పండగ వేళ థియేటర్లు వెలవెల

Tue Oct 08 2019 10:05:45 GMT+0530 (IST)

Dussehra Day Tollywood

టాలీవుడ్ కు పండగ సీజన్ చాలా కీలకం. పండగను నమ్ముకుని తమ సినిమాల్ని రిలీజ్ చేసి లాభాలార్జించాలని ప్రతి నిర్మాత.. ఫిలింమేకర్ ప్లాన్ చేస్తుంటారు. అలా గతంలో పండగ వేళ బరిలో దిగి కంటెంట్ వున్నచిత్రాలు భారీ వసూళ్లని సాధించిన గణాంకాలు తెలుగు సినీ చరిత్రలో కోకొల్లలు. పంగడలు అంటే సినిమా థియేటర్లన్నీ కళకళలాడిపోయేవి. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో జనమంతా థియేటర్ల ముందు ఈగల్లా మూగేవారు. సందడే సందడిగా ఉండేది. థియేటర్లన్నీ కిక్కిరిసిన జనంతో నిండిపోయేవి. భారీ అరుపులు కేకలలో అబ్బో జాతరను తలపించేవి.. కానీ ఇటీవల పరిస్థితి మారింది. థియేటర్ల దగ్గర పండగ వేళ జోష్ తగ్గిపోయింది. ప్రస్తుత సీన్ చూస్తుంటే.. ఒకరకంగా ఈగలు తోలుకునే గత్యంతరం ఏర్పడిందని తాజా లైవ్ రిపోర్ట్ చెబుతోంది.థియేటర్లలో బ్లాక్ బస్టర్ సినిమా ఆడుతుంటే జనాలు మాత్రం ఇంట్లో కూర్చుని అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. జీ 5 లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్లను చూస్తున్నారు. యువతరం అయితే పూర్తిగా స్మార్ట్ ఫోన్ - ల్యాప్ టాప్ లలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రమించి వంద కోట్లు కుమ్మరించి సినిమాలు తీసినా జనాలు మాత్రం టీవీలకు అతుక్కుపోవడం మేకర్స్ ని విస్మయానికి గురిచేస్తోంది. ఎన్ని కోట్లు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసినా జనం మాత్రం అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి బానిసలైపోవడం సినీ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముందు ముందు వెబ్ సిరీస్ ల యుగం మొదలైతే తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది భయపెడుతోంది.

క్లాస్ జనం థియేటర్లకు రావడం అన్నది అరుదే. భారీ సినిమా విడుదలైందంటే టొరెంట్లు డౌన్ లోడ్ చేసుకుని ఇంట్లోనే సినిమా చూస్తున్నారు. ఇది గత కొన్నేళ్లుగా టెక్నాలజీ విప్లవం తెచ్చిన ముప్పుగా పరిణమించింది. ఇదే అలవాటు మధ్య తరగతికి కూడా పాకి ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్- జీ5- నెట్ ఫ్లిక్స్-ఓటీటీ వేదికల్లో యధేచ్చగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది మొదలైంది. దీంతో థియేటర్లన్నీ పండగ వేళ వెలవెల బోతున్నాయి.

అసలు దసరా పండగ సందర్భంగా మాస్ థియేటర్లలో పరిస్థితి ఎలా ఉంది? అన్నది తుపాకి ఆరాతీస్తే తెలిసిన నిజం నిర్ఘాంతపోయేలా చేసింది. వైజాగ్ లోని ఓ పక్కా మాస్ ఏరియాలో వున్న థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `సైరా` నడుస్తోంది. మాస్ సెంటర్ అయినా థియేటర్ లో జనాలు లేకపోవడంతో సిబ్బంది ఈగలు తోలుతున్న పరిస్థితి నిశ్చేష్ఠపరిచింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చిన `సైరా` లాంటి సినిమాకే ఈ పరిస్థితి ఎదురైతే మును ముందు సినిమాల పరిస్థితి ఏంటి? అన్న గందరగోళం కనిపిస్తోంది. కాలం మారుతోందా?  జనాల మైండ్ సెట్ ఊహాతీతంగా మారిందా? ఇంతకీ లోకం పోకడ ఎటు వైపు? ఇలా అయితే తెలుగు సినిమా మనుగడ కష్టమేనా? అసలు పురోగతి ఎటువైపు సాగుతోంది.. !?