దసరా 'క్యూ' పెరుగుతూనే ఉంది

Tue Sep 14 2021 12:00:57 GMT+0530 (IST)

Dussehra Cinema Queue continues to grow

టాలీవుడ్ లో సెకండ్ వేవ్ తర్వాత సినిమా హడావుడి ఎట్టకేలకు ఈ నెల నుండి కనిపిస్తుంది. గత నెల నుండే సినిమాలు విడుదల అవుతున్నా కూడా జనాలు మాత్రం ఈ నెలలో థియేటర్లకు క్యూలు కడుతున్నారు. పెద్ద ఎత్తున జనాలు థియేటర్లకు వచ్చేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవల వచ్చిన సిటీమార్ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక దసరాకు నార్మల్ గా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించబోతున్నాయనే నమ్మకంతో తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. దసరా సెలవులు మరియు ఇతర ప్రత్యేక రోజులను దృష్టిలో పెట్టకుని వచ్చే నెలలో పెద్ద ఎత్తున పెద్ద సినిమాలను విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఇప్పటికే అఖండ సినిమా ను దసరాకు అంటున్నారు. అధికారిక ప్రకటన అతి త్వరలోనే వస్తుందేమో చూడాలి. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా దృశ్యం 2 ను కూడా దసరాకు విడుదల చేస్తామని అంటున్నారు.నారప్ప సినిమాను ఓటీటీ లో విడుదల చేసిన సమయంలోనే దృశ్యం 2 ను కూడా ఓటీటీ లో వినాయక చవితి సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 2 ను థియేటర్ల ద్వారా విడుదల చేయాలని.. అది కూడా దసరాకు విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట. దసరాకు రాబోతున్న సినిమాల డేట్ల విషయంలో కాస్త గందరగోళం ఉంది. అందుకే డేట్లు ఖరారు అయితే అప్పుడు దృశ్యం 2 విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. మొత్తానికి దృశ్యం 2 ఎంట్రీతో దసరా సీజన్ పోటీ మరింతగా పెరిగినట్ల్యింది. దసరాకు విడుదల చేసేందుకు పలువురు క్యూ లో ఉన్నారు. ఇందులో ఎంత మంది ఫైనల్ బరిలో ఉంటారు అనేది మరి కొన్ని రోజులు ఆగితే కాని క్లారిటీ లేదు.

దృశ్యం 2 మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. అక్కడ ఓటీటీ లో కాకుండా థియేటర్ల ద్వారా విడుదల అయ్యి ఉంటే భారీగా లాభాలు వచ్చేవి అంటూ మలయాళ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే దృశ్యం 2 ను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా ఓటీటీకి వెళ్లారు. ప్రముఖ ఓటీటీ వారు ఈ సినిమాను కొనుగోలు కూడా చేయడం జరిగింది. అయితే సినిమాలు థియేటర్ల విడుదలకు రెడీ అవుతున్న సమయంలో ఓటీటీ లో వెళ్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశ్యంతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకుని థియేటర్ క్యూ లోకి వచ్చేశారు. దసరాకు దృశ్యం 2 రావడం దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు. ఒక వేళ దసరాకు రాకుంటే దీపావళికి వస్తుందేమో చూడాలి. వెంకటేష్ మరియు మీనాలు నటించిన దృశ్యం 2 కు జీతూ జోషెఫ్ దర్శకత్వం వహించాడు.