రికార్డ్ : ఒక్క హీరో.. 3 భాషలు.. 5 సినిమాలు.. 4 హిట్స్

Mon Sep 26 2022 11:01:58 GMT+0530 (India Standard Time)

Dulquer Salman Movie Hits

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. మెగాస్టార్ మమ్ముట్టి పరువు తీస్తున్నాడు అంటూ స్వయంగా అప్పట్లో మలయాళ సినీ అభిమానులు కామెంట్స్ చేసేవారు. ఆ విమర్శల నుండి ఇప్పుడు దేశంలోనే టాప్ హీరోల జాబితా  లో దుల్కర్ సల్మాన్ నిలిచాడు అంటే ఆయన పడ్డ కష్టం.. ఆయన ప్లానింగ్ కు సూపర్ అనకుండా ఉండలేం.గడచిన ఏడాది కాలంలో దుల్కర్ సల్మాన్ నుండి ఏకంగా అయిదు సినిమాలు వచ్చాయి. ఒక హీరో ఏడాది కాలంలో అయిదు సినిమాలు చేయడం గొప్ప విషయం ఏమీ కాదు అనుకోవచ్చు. కానీ దుల్కర్ సల్మాన్ చేసిన అయిదు సినిమాల్లో ఒకటి తెలుగు సినిమా.. ఒకటి హిందీ సినిమా ఒకటి తమిళ సినిమా కాగా రెండు మలయాళ సినిమాలు.

మూడు భాషల్లో అయిదు సినిమాలు చేయడం మాత్రమే కాకుండా అందులో ఏకంగా నాలుగు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం కేవలం దుల్కర్ సల్మాన్ కే చెల్లింది. తెలుగు లో సీతారామం సినిమా తో దుల్కర్ సల్మాన్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సీతారామం సినిమా తో తెలుగు లో దుల్కర్ సల్మాన్ స్టార్ హీరోల సరసన నిలిచాడు.

దుల్కర్ సల్మాన్ హిందీలో నటించిన తాజా చిత్రం 'చుప్' కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఉత్తరాదిన ఇతర సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక మలయాళంలో ఈయన నటించిన కురుప్ మరియు సెల్యూట్ లు విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

గడిచిన ఏడాది కాలంలో దుల్కర్ సల్మాన్ తమిళంలో నటించిన హే సినామిక మాత్రమే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దుల్కర్ క్రేజ్ తో ఒక మోస్తరుగా వసూళ్లు రాబట్టినా కూడా ఓవరాల్ గా చూస్తే ఆ సినిమా ఫ్లాప్ సినిమాల జాబితాలో నిలిచినట్లే. ఆ సినిమా ఒక్కటి మినహా దుల్కర్ కి మిగిలిన నాలుగు సినిమాలు హిట్ గా నిలిచాయి.

ఒక హీరో ఒక్క ఏడాదిలో మూడు భాషల్లో అయిదు సినిమాలు చేసి అందులో నాలుగు సక్సెస్ చేసుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.. కచ్చితంగా ఇది గొప్ప రికార్డు గా నమోదు చేయాల్సిందే. దుల్కర్ సల్మాన్ ఇదే ప్లానింగ్ తో మంచి కథలు ఎంపిక చేసుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.