Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : దృశ్యం-2

By:  Tupaki Desk   |   25 Nov 2021 12:23 PM GMT
మూవీ రివ్యూ : దృశ్యం-2
X
చిత్రం : ‘దృశ్యం-2’

నటీనటులు: వెంకటేష్-మీనా-కృతిక జయకుమార్-ఎస్తేర్ అనిల్-సంపత్ రాజ్-నదియా-నరేష్-షఫి-తనికెళ్ల భరణి-పూర్ణ-సత్యం రాజేష్-సుజా వరుణి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: సతీష్ కురుప్
నిర్మాతలు: సురేష్ బాబు-ఆంటోనీ పెరుంబవూర్-రాజ్ కుమార్ సేతుపతి
రచన-దర్శకత్వం: జీతు జోసెఫ్

దృశ్యం.. ఏడేళ్ల కిందట మలయాళంలో సెన్సేషనల్ హిట్టయి ఆ తర్వాత తెలుగు సహా పలు భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా మంచి విజయాన్నందుకున్న చిత్రం. ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో దీనికి సీక్వెల్ రాగా.. ఇప్పుడు ఆ చిత్రం తెలుగులో రీమేక్ అయింది. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తన కూతురి నగ్న వీడియో తీశాక భార్య-కూతురి చేతిలో హతమైన వరుణ్ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే పాతిపెట్టి పోలీసులందరినీ తప్పుదోవ పట్టించడం ద్వారా ఈ కేసు నుంచి తనతో సహా కుటుంబంలో అందరినీ బయటపడేస్తాడు రాంబాబు (వెంకటేష్). కానీ మీడియా దృష్టిలో.. జనాల దృష్టిలో ఫూల్స్ కావడంతో పోలీసులు ఈ కేసును అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఆరేళ్ల తర్వాత కూడా వరుణ్ మృతదేహం కోసం.. రాంబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాల కోసం వెతుకుతూనే ఉంటారు. వాళ్ల శ్రమ ఫలించి వరుణ్ మృతదేహం పోలీస్ స్టేషన్లోనే తెలుస్తుంది. దాన్ని బయటికి తీసి రాంబాబును అరెస్టు చేయగా.. అతను తానే నేరం చేశానని ఒప్పుకుంటాడు. సాక్ష్యాలన్నీ అతడికి వ్యతిరేకంగా ఉండటంతో రాంబాబు పనైపోయిందనిపిస్తుంది. ఈ స్థితి నుంచి రాంబాబు తప్పించుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘దృశ్యం’ సినిమా కథ ప్రకారం చూస్తే చట్ట ప్రకారం హీరో చేసేది తప్పు. కానీ న్యాయంగా చూస్తే.. తన నగ్న వీడియో తీసిన కుర్రాడిని ఆవేశంలో కూతురు.. భార్య కలిసి చంపేస్తే మృతదేహాన్ని మాయం చేసి వాళ్లతో సహా తాను కూడా తప్పించుకోవడంలో తప్పు కనిపించదు. ఈ కోణంలో తన ఊరి వాళ్లకు కూడా రాంబాబు చేసింది న్యాయంగానే అనిపించి అతడికి మద్దతుగా నిలుస్తారు. ఐతే పోలీసుల కోణంలో చూస్తే మాత్రం రాంబాబు చేసింది నూటికి నూరు శాతం తప్పు. హత్య ఎందుకు జరిగిందన్నది పక్కన పెడితే.. హత్య చేసిన వాడు తమను వెధవల్ని చేసి దర్జాగా బయట తిరిగేస్తుంటే పోలీసులు ఇగో మీద దెబ్బ కొట్టినట్లే అవుతుంది. ఇక కొన్నేళ్లు గడిచే క్రమంలో రాంబాబు బాగా డబ్బు సంపాదించి ఆర్థికంగా ఒక స్థాయిని అందుకుంటాడు. అలాంటపుడు ఊర్లోని మిగతా వారికి కన్ను కుట్టకుండా ఉంటుందా? మరి వాళ్లు ఊరుకుంటారా? ఈ స్థితిలో వరుణ్ హత్య కేసును పోలీసులు తిరగదోడితే..? ఊర్లో వాళ్లూ వారికి సహకరిస్తే..? వరుణ్ మృతదేహాన్ని కనిపెడితే..? రాంబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరిస్తే..? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనే కోణంలో నూటికి నూరుశాతం సీక్వెల్ లక్షణాలతో.. ‘దృశ్యం’కు ఏమాత్రం తగ్గని థ్రిల్ ఇస్తూ సాగే సినిమా ‘దృశ్యం-2’. ఇండియన్ సినిమాలోనే బెస్ట్ సీక్వెల్స్ లో కచ్చితంగా ‘దృశ్యం-2’ ఉంటుందనడంలో సందేహం లేదు.

‘దృశ్యం’ సినిమాలో అత్యంత ఆకట్టుకునేది మనలో ఒకడిలా.. ఒక సామాన్యుడిలా కనిపించే హీరో.. తన సినిమా పిచ్చి ద్వారా పెంచుకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య కేసు నుంచి తనను.. తన కుటుంబాన్ని రక్షించుకునే వైనం. సామాన్యంగా కనిపిస్తూ అసామాన్యంగా మారే అతడి పాత్ర లాగే.. అందులోని కథ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ‘దృశ్యం’ ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే మొదలయ్యే ‘దృశ్యం-2’లో కూడా హీరో పాత్ర అంతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన కుటుంబాన్ని వెంటాడుతూనే వచ్చి తనను పీకల్లోతు ముంచేసేలా కనిపించే హత్య కేసు నుంచి అతను మరోసారి తప్పించుకునే వైనం చూసి నోరెళ్లబెట్టకుండా ఉండేం. వరుణ్ డెడ్ బాడీని పోలీసులు కనిపెట్టేసి.. పక్కా సాక్ష్యాలతో హీరో దొరికిపోయాక ఇంకేముంది అంతా అయిపోయింది.. కథను దర్శకుడు ఇలా తేల్చేశాడేంటి అనిపిస్తుంది కానీ.. ఆ తర్వాత హీరో వేసిన మాస్టర్ ప్లాన్ గురించి తెలుసుకుని పోలీసులెలా షాకైపోతారో ప్రేక్షకుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఈ ‘ప్లాన్’ తాలూకు లోతుల్లోకి ఇక్కడ వెళ్లడం లేదు కానీ.. ‘దృశ్యం’ ప్రియులందరూ సినిమా చూసే ఆ ఉత్కంఠను అనుభవించాలి. ఇక్కడ దర్శకుడు రాత.. తీత గురించి ఎంత కొనియాడినా తక్కువే. రాంబాబు పాత్ర పట్ల మళ్లీ ఒక ఆపేక్ష కలిగించి.. ఆ పాత్రను మరింతగా ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాకు అదిరిపోయే ముగింపు ఇచ్చాడు దర్శకుడు.

‘దృశ్యం-2’ ద్వితీయార్ధంలో బోలెడంత ఉత్కంఠ.. కావాల్సినంత థ్రిల్ ఉంది కానీ.. అంతకుముందు వరకు సినిమాను కొంచెం ఓపికతోనే చూడాల్సి ఉంటుంది.

అసలేముందీ సీక్వెల్లో అనిపించేలా.. చాలా సాధారణంగా నడుస్తుంది ప్రథమార్ధం. వరుణ్ కేసు రాంబాబు కుటుంబాన్ని ఎలా వెంటాడుతోందో చూపించే సన్నివేశాలతోనే చాలా వరకు ప్రథమార్ధం నడుస్తుంది. చాలా వరకు సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. తొలి గంటలో ఉత్కంఠ రేపే సన్నివేశాలేమీ లేవు. అసలెందుకు తీశారు ఈ సీక్వెల్ అన్న ఆలోచన కలుగుతుంది ఒక దశలో. ‘దృశ్యం’ ముందు సీక్వెల్ తేలిపోతుందేమో అన్న అభిప్రాయాలు కూడా కలుగుతాయి. కానీ రాంబాబు కుటుంబాన్ని పోలీసులు ఎలా టార్గెట్ చేశారు.. హత్య కేసును ఛేదించడం కోసం వాళ్లెలాంటి రహస్య ప్రణాళికను అమలు చేస్తున్నారనే ట్విస్ట్ రివీల్ చేశాక కథ రసకందాయంలో పడుతుంది. అక్కడే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలవుతుంది. ఈ సినిమాలోనూ ఏదో ప్రత్యేకత ఉందనే ఫీలింగ్ మొదలవుతుంది. ద్వితీయార్ధంలో ఒక్కో ట్విస్ట్ రివీల్ చేయడం మొదలయ్యాక.. ప్రథమార్ధంలో చాలా సాధారణంగా అనిపించిన సన్నివేశాల తాలూకు మర్మం అర్థమవుతుంది. తనికెళ్ల పాత్ర తాలూకు థ్రెడ్ సినిమాలో మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ‘దృశ్యం-2’ తీసిన దర్శకుడే ఇక్కడా సినిమాను హ్యాండిల్ చేయడంలో ఎక్కడా తప్పు జరగలేదు. చివర్లో కోర్టు సన్నివేశాలు మాత్రం ఒరిజినల్ తో పోలిస్తే కొంచెం ఎఫెక్ట్ తగ్గినట్లు అనిపిస్తాయి. ‘దృశ్యం’ చూసి మెచ్చిన వాళ్లు నిరభ్యంతరంగా ఈ సినిమా చూడొచ్చు. ప్రథమార్ధాన్ని కొంచెం ఓపికతో చూస్తే.. ఆ తర్వాత కావాల్సినంత థ్రిల్ ఇస్తుంది ‘దృశ్యం-2’.

నటీనటులు:

రాంబాబుగా వెంకటేష్ మరోసారి చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఆయనకు గడ్డం లుక్ బాగా సెట్ అయింది. లుక్ పరంగా ఫస్ట్ పార్ట్ కంటే మెరుగ్గా అనిపిస్తాడు. నటన పరంగా మోహన్ లాల్ తో పోల్చి చూస్తే కొంచెం తగ్గినట్లు అనిపిస్తాడు కానీ.. మామూలుగా అయితే వెంకీ రాంబాబు పాత్రలో పర్ఫెక్ట్ అనిపించాడు. రీమేక్ మూవీ అయినా తన శైలిలో రాంబాబు పాత్రను పండించడానికి వెంకీ మంచి ఎఫర్ట్ పెట్టాడు. వెంకీ భార్యగా మీనా కూడా బాగా చేసింది. ఇద్దరు కూతుళ్ల పాత్రలు చేసిన అమ్మాయిలూ ఓకే. మిగతా నటీనటుల్లో ఐజీ పాత్రలో సంపత్ అదరగొట్టాడు. ఫస్ట్ పార్ట్ నుంచి కొనసాగింపుగా వచ్చిన నరేష్.. నదియా కూడా తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. తనికెళ్ల భరణి.. షఫి సహాయ పాత్రల్లో ఆకట్టుకున్నారు. సుజా వరుణి.. సత్యం రాజేష్ కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

‘దృశ్యం’తో పోలిస్తే ‘దృశ్యం-2’లో సంగీతానికి ప్రాధాన్యం తగ్గింది. పాటల పరంగా ఏ ప్రాధాన్యం లేదు. ఉన్న ఒక్క పాట కూడా ఏమంత ఆకట్టుకోదు. మలయాళ ‘దృశ్యం-2’తో పోలిస్తే ఇక్కడ నేపథ్య సంగీతం ప్రభావం అంతగా కనిపించదు. అనూప్ రూబెన్స్ ఇలాంటి థ్రిల్లర్లకు మంచి ఛాయిస్ కాదనిపించేలా బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగానే ఇచ్చాడు. చివరి అరగంటలో అనుకున్న స్థాయిలో ఆర్ఆర్ ఉత్కంఠ రేకెత్తించలేకపోయింది. సన్నివేశాల్లో ఎంతో బలం ఉండగా.. వాటిని నేపథ్య సంగీతంతో మరింత ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా అనూప్ అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. సతీష్ కురుప్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక దర్శకుడు జీతు జోసెఫ్ గురించి చెప్పేదేముంది? ఇన్నేళ్లు టైం తీసుకుని ‘దృశ్యం’కు సీక్వెల్ తీసిన ఆయన.. ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరిచాడు. కథ పరంగా ఆయన ఆలోచనలు.. స్క్రీన్ ప్లే రాసుకున్న తీరుకు.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన వైనానికి ఫిదా అవ్వకుండా ఉండలేం. ఒరిజినల్ నుంచి పక్కకు వెళ్లకుండా ఫెయిత్ ఫుల్ రీమేక్ అందించారాయన.

చివరగా: దృశ్యం-2.. రాంబాబు మళ్లీ గెలిచాడు

రేటింగ్-3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in OTT