Begin typing your search above and press return to search.

డ్రగ్స్ ఇష్యూ : నేషనల్ మీడియా vs బాలీవుడ్...!

By:  Tupaki Desk   |   26 Sep 2020 7:15 AM GMT
డ్రగ్స్ ఇష్యూ : నేషనల్ మీడియా vs బాలీవుడ్...!
X
డ్రగ్స్ ఇష్యూ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ గురించే చర్చించుకుంటున్నారు. సుశాంత్‌ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి మరికొందరికి సమన్లు జారీ చేసి విచారిస్తోంది. డ్రగ్స్ ఆరోపణలతోహీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - దీపికా పదుకొణె - సారా అలీఖాన్‌ - శ్రద్ధా కపూర్లతోపాటు దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌ కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో రకుల్‌‌ - కరీష్మా ప్రకాశ్‌ లను శుక్రవారం విచారించారు. వీరితో పాటు ధర్మ ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ క్షితిజ్‌ రవి ప్రసాద్ ని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్‌ అధినేత కరణ్ జోహార్ గతంలో తన నివాసంలో నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో అంటూ నేషనల్ మీడియాలో ప్రసారం అవుతూ వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. గతేడాది కరణ్ జోహార్ నిర్వహించిన హౌస్ పార్టీని చూపిస్తున్న ఈ వీడియోలో దీపికా పదుకోనె - రణబీర్ కపూర్ - విక్కీ కౌషల్ - షాహిద్ కపూర్ - వరుణ్ ధావన్ - మలైకా అరోరా - అర్జున్ కపూర్‌ - జోయా అక్తర్ - అయాన్ ముఖర్జీ వంటి సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ క్రమంలో దీనిపై బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ స్పందించారు. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ బిల్లుల గురించి మాట్లాడటానికి బదులు గతేడాది కరణ్‌ జోహార్ ఇంట్లో నిర్వహించిన పార్టీ మీద మీడియా ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అంటూ ట్వీట్‌ చేశారు.

''కరణ్ జోహార్ తన పార్టీ కోసం కొంతమంది రైతులను కూడా ఆహ్వానించినట్లయితే.. మన టీవీ ఛానెళ్లకు పని సులభం అయ్యేది. అప్పుడు ప్రస్తుతం వారు రైతుల నిరసన, కరణ్ పార్టీల మధ్య ఒక దాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఉండేది కాదు! కరణ్‌ తన రెండవ పార్టీని మన చానెళ్లతో చేయాల్సి ఉన్నట్లు అనిపిస్తుంది'' అంటూ జావేద్ అక్తర్ ట్వీట్ చేశారు. ఇక కరణ్ జోహార్ సైతం వీటిని ఖండిస్తూ కరణ్ ఓ లేఖ విడుదల చేశారు. ఎన్.సిబి విచారిస్తున్న క్షితిజ్ ప్రసాద్ మరియు అనుభవ్ చోప్రాలు తనకు వ్యక్తిగతంగా తెలియదని.. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులకు అతను లేదా ధర్మ ప్రొడక్షన్స్ బాధ్యత వహించడం కుదరదని పేర్కొన్నారు. దీనికి మలైకా అరోరా - మనీష్ మల్హోత్రా - అలియా భట్ - వరుణ్ ధావన్ - విక్కీ కౌశల్ వంటి వారు రియాక్ట్ అయ్యారు.

ఇంతకముందు సీనియర్ నటి పూజా బేడీ ట్వీట్ చేస్తూ బాలీవుడ్‌ పరిశ్రమ మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు మీడియా హడావుడి చేస్తుందని విమర్శించారు. బాలీవుడ్‌ కాకుండా మిగతా రంగాలలో విపరీతంగా డ్రగ్స్‌ వాడుతున్న వారిని మనం ఎందుకు వెంటాడటం లేదు? అని ప్రశ్నించింది. #BollywoodCleanup అంటూ మీడియా ముఖ్యమైన సమస్యల నుండి పక్కదారి పట్టించాడనికేనా? అని పూజా బేడీ అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం మీద బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ ఇష్యూలో నేషనల్ మీడియా vs బాలీవుడ్ అనే విధంగా కొనసాగుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.