సుమలతకు పవర్ స్టార్ నో సపోర్ట్

Thu Mar 21 2019 19:36:30 GMT+0530 (IST)

Dont use my name in politics Says Puneeth Rajkumar

దేశ వ్యాప్తంగా ఎన్నికల సందర్బంగా హైడ్రామా కొనసాగుతుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా కూడా పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ముఖ్యంగా సౌత్ లో సినీ స్టార్స్ మరియు రాజకీయ నాయకులు హడావుడి తెగ చేస్తున్నారు. ఇటీవలే భర్తను కోల్పోయిన సుమలత ఆయన కోరిక మేరకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతుంది. మాండ్య పార్లమెంటు స్థానం నుండి సుమలత ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్దం అయ్యింది. అయితే ఈ స్థానంను అక్కడ జేడీఎస్ అధినేత - ముఖ్యమంత్రి కుమార స్వామి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.ఈ స్థానంకు బదులుగా సుమలతకు రాష్ట్రంలో ఏ స్థానంను ఇచ్చేందుకు అయినా జేడీఎస్ ఓకే చెప్పింది. కాని సుమలత మాత్రం మాండ్య నుండే పోటీకి సిద్దం అయ్యింది. సుమలతకు కన్నడ సినీ ప్రముఖులు పలువురు మద్దతుగా నిలిచారు. ఆమె తన పోటికి సంబంధించిన విషయాన్ని ప్రకటించిన సమయంలో కేజీఎఫ్ స్టార్ యష్ మరియు ఇంకా పలువురు కన్నడ స్టార్స్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ సుమలత గారికి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మద్దతు కూడా ఉందని మనం అంతా కూడా అక్క సుమలతకు మద్దతుగా ప్రచారం చేద్దాం అంటూ పునీత్ తనతో అన్నాడు అంటూ రాక్ లైన్ వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

రాక్ లైన్ వెంకటేష్ వ్యాఖ్యలను పునీత్ రాజ్ కుమార్ ఖండించాడు. తాను సుమలత గారికి మద్దతు ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. తాను కేవలం ఒక నటుడిని మాత్రమే అని రాజకీయాలకు పూర్తి దూరంగా తాను ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి దేశ భవిష్యత్తును చక్క బెట్టే వారికి మీకు మంచి చేసే వారిని ఎన్నుకోండి అంటూ సూచించాడు. నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఏ ఒక్కరికి మద్దతుగా తాను ప్రచారం చేయబోవడం లేదు అంటూ పునీత్ రాజ్ కుమార్ ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ ప్రకటించడంతో సుమలతకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ మద్దతు సుమలతకు ఉంటే ఖచ్చితంగా ఆమెకు అదనపు బలం అయ్యేది అంటూ స్థానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.