జీ5 ఆధ్వర్యంలో 'దొంగతనం'.. దీని వెనకున్న మేధావులు ఎవరో తెలుసా..?

Wed Jan 26 2022 22:00:01 GMT+0530 (IST)

Dongathanam On ZEE5

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించడానికి జీ 5 ఓటీటీ సంస్థ కృషి చేస్తోంది. దిగ్గజ ఓటీటీలకు ధీటుగా నిలబడటానికి ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ.. సబ్ స్క్రైబర్స్ పెంచుకుంటూ వెళ్తోంది. గత కొన్ని నెలలుగా తెలుగు కంటెంట్ మీద ఫోకస్ పెట్టిన జీ గ్రూప్.. తెలుగు ప్రేక్షకులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా ఒరిజినల్ వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కి పెడుతోంది. క్రేజీ చిత్రాలను కొనుగోలు చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి జీ5 ఓటీటీ సంస్థ సినిమాలు - ఒరిగినల్ చిత్రాలను నిర్మిస్తోంది. లేటెస్టుగా 'లూజర్ 2' వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న ఓటీటీ వేదిక.. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది.

అయితే త్వరలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలేవీ వెల్లడించకుండా వినూత్న రీతిలో పబ్లిసిటీ చేస్తున్నారు. జీ5 ఓటీటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఓ విచిత్రమైన 'దొంగతనం' జరిగింది అని పేర్కొన్నారు. పేదరికానికి శ్రేయస్సుకు మధ్య ఉన్న ఈ ముత్యాల నగరంలో నలుగురు దొంగల కథ ఇదని తెలిపారు.

నవాబుల నగరంలో ‘దొంగతనం’ వెనుక ఒక మేధావి ఉన్నాడని.. ఈ దొంగతనానికి ఐడియా ఇచ్చింది ఒక మాస్ ఎనర్జిటిక్ డైరెక్టర్ అని.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో గెస్ చేయమని జీ5 టీమ్ ఓ షాడో ఇమేజ్ ని షేర్ చేసింది. అలానే హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ మహత్తర ‘దొంగతనం’కి స్పాన్సర్ చేయబోతున్నది ఒక టాప్ ప్రొడ్యూసర్ అని.. ఆ నిర్మాత ఎవరో ఊహించమని మరో షాడో ఇమేజ్ వదిలారు.

Zee5 నుంచి త్వరలోనే ఓ బిగ్ అనౌన్స్ మెంట్ రాబోతోందని.. ఆలోపు డైరెక్టర్ & ప్రొడ్యూసర్ ఎవరో ఊహించండని.. 'దొంగతనం' పక్కా జరుగుతుందని.. వివరాలు త్వరలో వెల్లడించబడతాయని పేర్కొన్నారు. అయితే షాడో ఇమేజెస్ లో ఉంది దర్శకుడు హరీష్ శంకర్ - నిర్మాత దిల్ రాజు అని నెటిజన్స్ గెస్ చేస్తున్నారు. 'దొంగతనం' అని స్పెషల్ గా మెన్షన్ చేయడాన్ని బట్టి చూస్తే జీ5 ఓటీటీ కోసం దర్శకనిర్మాతలిద్దరూ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఊహిస్తున్నారు. ఇది అవునో కాదో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఆగాల్సిందే.