'దొంగలున్నారు జాగ్రత్త' పబ్లిక్ టాక్!

Sat Sep 24 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

'Dongalunnaru Jagratha' Public Talk

ఈ శుక్రవారం మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో ప్రముఖ సంగీత దర్శకడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన లేటెస్ట్ మూవీ 'దొంగలున్నారు జాగ్రత్త' కూడా వుంది. తెలుగులో వస్తున్న తొలి సర్వైవల్ కామెడీ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందించారు. హాలీవుడ్ మూవీ '4x4' ఆధారంగా ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.  శ్రీసింహా హీరోగా నటించగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో విలన్ గా సముద్రఖని నటించారు.సతీష్ త్రిపుర దర్శకుడిగా పరిచయం అయిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు సునీత తాటి సంయుక్తంగా నిర్మించారు. టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఎలా వుంది? .. ట్రైలర్ తో బజ్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? .. ఈ మూవీపై పబ్లిక్ టాక్ ఏంటీ అన్నది ఇప్పుడు చూద్దాం.

రాజు (శ్రీసింహా) ఓ దొంగ. కార్లలో వుండే విలువైన వస్తువుల్ని దొంగిలిస్తూ వుంటాడు. అలా దొంగతనం కోసం ఓ కారుని ఎంచుకుంటాడు. పక్కా ప్లాన్ తో చుట్టూ ఎవరూ లేనిది గమనించి అందులోకి దూరతాడు. అయితే అనూహ్యంగా అది సెంటర్ లాక్ అయిపోవడంతో రాజు అందులో ఇరుక్కుపోతాడు. రాజు తను ఎంచుకున్న కార్ లో లాక్ అయిపోవడానికి ఓ డాక్టర్ కారణం అని తెలుస్తుంది. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? .. రాజునే ఎందుకు టార్గెట్ చేశాడు?.. అసలు విషయం తెలుసుకున్న రాజు ఆ కారులోంచి బయటపడ్డా? .. చివరికి ఏం జరిగింది అన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.

తెలుగు తెరకు సర్వెవల్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసిన మూవీ ఇది. పతాక సన్నివేశాలు మినహా సినిమా మొత్తం కారులోనే జరగడం ఈ సినిమా ప్రత్యేకత. హాలీవుడ్ మూవీ 4x4 ఆధారంగా ఈ మూవీని మన నేటీవిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. ఇక ఆరంభ సన్నివేశాలు సాగదీతగా సాగి చిరాకు పుట్టిస్తాయి. ఈ తరహా కథలకు థ్రిల్లింగ్ కలిగించే మరిన్ని ఆసక్తికర అంశాలని జోడిచి ప్రేక్షకుడికి క్షణ క్షణం ఏం జరబోతోందనే ఉత్సుకతని కలిగించినప్పుడు సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అంతే కాకుండా ఎమోషన్స్ ని మరితం బలంగా ఆవిష్కరించి చూపించడం కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

కానీ ఇవేవీ ఈ సినిమాలో కనిపించవు. దర్శకుడు ఈ విషయాల్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. ఇలాంటి కథకు ప్రధానమైన వాటిని తెరపై మరింత బలంగా ఆవిష్కరించడంతో దర్శకుడు విఫలం అయ్యాడని చెప్పొచ్చు.

కొత్త గా చెబుతారనుకున్న కథ కాస్తా సాధరణ రివేంజ్ డ్రామాగా మారడంతో ప్రేక్షకుడిలో ఆసక్తి పోయింది. సందేశం పతాక ఘట్టాలు ఆసక్తికరంగా వున్నా..కథ కథనాల్లో బలం లేకపోవడంతో అవే ఈ సినిమాకు ప్రధాన బలహీనతలుగా మారాయి. దీంతో కొత్త అనుభూతిని కలిగిస్తుందని భావించిన ఈ మూవీ ఏ విషయంలోనూ సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేక ఉసూరుమనిపించింది. ఇలాంటి సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుండేది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.