Begin typing your search above and press return to search.

తమిళ హీరోలకు అంత 'రేంజ్' ఉందా..?

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 PM GMT
తమిళ హీరోలకు అంత రేంజ్ ఉందా..?
X
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసు రాష్ట్రంలో భాగం కావడంతో సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడే కేంద్రీకృతమై ఉండేది. అయితే తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది. అయినప్పటికీ తెలుగు - తమిళ నటీనటుల మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొందరు తమిళ హీరోలు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు.

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన రజినీకాంత్ - కమల్ హాసన్ వంటి వారు తమ సినిమాలను డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో విక్రమ్ - సూర్య - విజయ్ - విశాల్ - ధనుష్ - కార్తీ - ఆర్య వంటి హీరోలు కూడా డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి తమిళ హీరోలంతా స్ట్రెయిట్ తెలుగు సినిమాల మీద ఆసక్తి కనబరిచారు. అలానే టాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు వారితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే కార్తీ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయగా.. ఇప్పుడు ధనుష్ - విజయ్ - సూర్య - శివ కార్తికేయన్ వంటి హీరోలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పుడు.. తమిళ హీరోలు తెలుగు చిత్రాలు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ.. మన హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాస్త విడ్డూరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తమిళ హీరోలతో ప్రాజెక్ట్స్ చేస్తున్న తెలుగు నిర్మాతలు అందరూ వారికి భారీ పారితోషికాలు ఆఫర్ చేశారట. ఒక హీరోకి వంద కోట్లు ఇస్తున్నారనే టాక్ నడుస్తుంటే.. మరో హీరోకి పాతిక కోట్లు ఇస్తున్నారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇదే కొంత మంది టాలీవుడ్ హీరోలకి మింగుడు పడటం లేదట. వాళ్ళకి అన్నని కోట్లు ఇస్తూ.. వాళ్ళ కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న తెలుగు హీరోలకు మాత్రం అంత ఇవ్వకపోవడం ఏంటని ఇక్కడి నిర్మాతల మీద గుర్రుగా ఉన్నారట. ఈ నేపథ్యంలో అంత రెమ్యూనరేషన్లు ఇచ్చేంత రేంజ్ తమిళ హీరోలకు ఉందా అనే సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఏ ధీమాతో భారీ పారితోషికాలు ఇచ్చి సినిమాలు చేస్తున్నారో ఇక్కడి నిర్మాతలకే తెలియాలి.