Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : డీజే టిల్లు

By:  Tupaki Desk   |   12 Feb 2022 12:11 PM GMT
మూవీ రివ్యూ : డీజే టిల్లు
X
చిత్రం : డీజే టిల్లు

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ-నేహా శెట్టి-ప్రిన్స్-బ్రహ్మాజీ-నర్రా శీను-ప్రగతి-కిరీటి-ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల-రామ్ మిర్యాల
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-స్క్రీన్ ప్లే: విమల్ కృష్ణ-సిద్ధు జొన్నలగడ్డ
మాటలు: సిద్ధు జొన్నలగడ్డ
దర్శకత్వం: విమల్ కృష్ణ

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాతో ఉన్నట్లుండి రైజ్ అయి యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. తన సినిమాలకు రచనా సహకారం కూడా అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న సిద్ధు.. ఇప్పుడు ‘డీజే టిల్లు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు హీరోగా.. రచయితగా అతనే అతి పెద్ద బలం. ట్రైలర్ తో యువతను విపరీతంగా ఆకర్షించిన ఈ చిత్రం.. సినిమాగా ఏమేర ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

తల్లిదండ్రులు పెట్టిన బాలగంగాధర్ తిలక్ అనే పేరును టిల్లుగా మార్చుకుని చిన్న చిన్న ఫంక్షన్లలో డీజే కొడుతూ.. బయటికి పెద్ద బిల్డప్ ఇస్తూ తన స్టయిల్లో జీబితాన్ని సాగిస్తుంటాడు ‘డీజే టిల్లు’. ఇలా సాఫీగా సాగిపోతున్న అతడి జీవితంలోకి అనుకోకుండా రాధిక (నేహా శెట్టి) వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ (కిరీటి) నుంచి విడిపోతున్న దశలో టిల్లు పరిచయం కావడంతో అతడికి చేరువ అవుతుంది రాధిక. ఈ సంగతి తెలిసి రోహిత్ ఆమెతో గొడవ పడతాడు. ఈ క్రమంలో అనుకోని విధంగా రోహిత్ చనిపోతాడు. ఈ కేసులో రాధికతో పాటు టిల్లు కూడా చిక్కుకుంటాడు. దీని వల్ల తలెత్తిన పరిణామాలేంటి.. ఈ హత్యతో వీళ్లిద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

జబర్దస్త్ తరహా టీవీ కామెడీ స్కిట్ల దెబ్బకు సినిమా కామెడీ కుదేలైపోయింది. అక్కడ ఒకప్పట్లా కామెడీ చేస్తే జనాలకు ఎక్కట్లేదు. స్పూఫులు.. పేరడీలు చేస్తే ఇవన్నీ టీవీ స్కిట్లలో చూస్తున్నవేగా అంటున్నారు. ప్రాసలు.. పంచులు పేల్చినా అక్కడా ఇవేగా అంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ రచయితలు.. దర్శకులు కామెడీ కథలు చేయాలనుకున్నపుడు ‘జబర్దస్త్’ను మించిన హడావుడి కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ‘పిచ్చి’ కథలు తెరపైకి వస్తున్నాయి. ఆ కథలు వినడానికి పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి. చూసేటపుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అలాంటి ‘మ్యాడ్ నెస్’యే యువతకకు నచ్చుతోంది. హీరో క్యారెక్టర్ తేడా తేడాగా.. అల్లరల్లరిగా ఉండి.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటేనే యువతకు కిక్ వస్తోంది. కథ ఒక తీరుగా నడవకపోయినా.. లాజిక్ లెస్ గా అనిపించినా.. యువ ప్రేక్షకులు కోరుకున్న ‘అల్లరి’ ఉంటే చాలు ఆ సినిమాలు పాసైపోతున్నాయి. గత ఏడాది ఘనవిజయం సాధించిన ‘జాతిరత్నాలు’ సినిమానే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడీ ‘డీజే టిల్లు’ సైతం అలాంటి అల్లరి సినిమానే. ‘జాత రత్నాలు’లో చూసిన మ్యాడ్నెస్సే ఇందులోనూ కనిపిస్తుంది. హీరో చేససే అల్లరికి కనెక్టయితే ఇందులో టైంపాస్ కు ఢోకా లేదు. అంతకుమించి కథాకథనాల గురించి సీరియస్ గా ఆలోచిస్తే కష్టం.

‘డీజే టిల్లు’ ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ ఏంటన్నది అర్థమైపోయింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయిన సిద్ధునే ఈ సినిమా వైపు ప్రేక్షకులను ఆకర్షించాడు. కొంచెం టిపికల్ గా అనిపించే అతడి నటన.. అలాగే హైదరాబాద్ అర్బన్ యూత్ వాడే మాస్ స్లాంగ్ తో సాగిన అతడి డైలాగ్స్ ట్రైలర్లో ప్రత్యేకంగా అనిపించాయి. ట్రైలర్ చూసి ఏ అంచనాతో థియేటర్లలోకి అడుగు పెడతారో.. అందుకు తగ్గ వినోదాన్ని అందిస్తాడు సిద్ధు. ప్రథమార్ధం వరకు అయితే అతను అంచనాలను మించి ఎంటర్టైన్ చేశాడు. ప్రోమోలతోనే డీజే టిల్లు మనకు బాగా పరిచయం ఉన్న పాత్రలా మారిపోవడం.. సినిమా మొదలయ్యాక ఆ పాత్రకు అలవాటు పడటానికి పెద్దగా సమయం పట్టదు. ఎంట్రీ దగ్గర్నుంచి తనదైన బిల్డప్పులతో సాగే ఆ పాత్రకు.. తన మాటలకు ఫిదా అయిపోతాం. టిపికల్ హైదరాబాదీ అర్బన్ యూత్ స్లాంగ్ తో సాగే అతడి డైలాగులకు పడీ పడీ నవ్వుకోవాల్సిందే. సిద్ధు యూత్ నాడిని ఎంత బాగా పట్టుకున్నాడో అతడి ప్రతి డైలాగ్ లో కనిపిస్తూనే ఉంటుంది.

‘డీజే టిల్లు’ ఒక మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ ఫిలిం. ఇందులో హీరోయిన్ చేతిలో అనుకోకుండా ఒక వ్యక్తి హతమవుతాడు. ఆమె హీరోను తన ఇంటికి పిలుస్తుంది. తన ప్రేయసి పిలిచింది కదా అని తన బర్త్ డే ఫంక్షన్ని కూడా పక్కన పెట్టి పరుగెత్తుకెళ్లి అక్కడ వాలిపోతాడు హీరో గారు. హీరోయిన్ పిలిచిన హుషారులో తన అపార్ట్ మెంట్ కింద అతను చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆల్రెడీ విషయం తెలిసిన ప్రేక్షకులకు అతను చేసే హంగామా చూస్తే కడుపు చెక్కలవ్వాల్సిందే. ఇంతా చేసి అసలు విషయం తెలిశాక హీరో బెంబేలెత్తిపోతూ చేసే బీభత్సం కూడా అంతే నవ్విస్తుంది. దాదాపు అరగంట సాగే ఈ ఎపిసోడ్ ఒక్కటి చాలు టికెట్ డబ్బులు గిట్టుబాటైపోవడానికి. ఆరంభం నుంచి కూడా తెర మీద జరిగే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి టిల్లు పాత్రతో కనెక్ట్ అయ్యామంటే చాలు.. బోలెడంత ఎంటర్టైన్ అయిపోతాం. ఐతే ప్రథమార్ధం వరకు కథ కూడా ఓ మోస్తరుగా నడుస్తూ ఓకే అనిపిస్తుంది.

ఫస్టాఫ్ లో ఉన్న టెంపో రెండో అర్ధంలోనూ కొనసాగితే ‘డీజే టిల్లు’ రేంజే వేరుగా ఉండేది. కానీ రెండో అర్ధానికి వచ్చేసరికి ఒక పద్ధతీ పాడూ లేకుండా.. లాజిక్ కు స్కోపే లేకుండా ఎలా పడితే అలా సాగిపోయే కథ.. సిల్లీ సీన్లు ‘డీజే టిల్లు’ గ్రాఫ్ ను తగ్గించేస్తాయి. సిద్ధు పాత్రలోనూ రెండో అర్ధంలో హుషారు తగ్గిపోవడం.. క్లూ లెస్ గా కనిపించడంతో సినిమా గాడి తప్పిపోయింది. అచ్చంగా ‘జాతి రత్నాలు’ టైపులో సన్నివేశాల్ని మరీ సిల్లీగా నడిపించడంతో ప్రేక్షకులకు పిచ్చెక్కిపోతుంది. అందులో మాదిరే ఇక్కడా కోర్టు సీన్ సైతం పెట్టారు. సన్నివేశాలు మరీ నాన్ సీరియస్ గా ఉండటం.. కామెడీ కూడా అంతగా వర్కవుట్ కాకపోవడంతో ‘డీజే టిల్లు’ తిరోగమన దిశలో పయనిస్తుంది. చివర్లో మళ్లీ సిద్ధు కొంచెం సందడి చేసినా.. అతను కూడా సినిమాను లేపలేకపోయాడు. ఐతే ప్రథమార్ధంలో అతనిచ్చిన కిక్ మాత్రం అంత తేలిగ్గా వదిలిపోయేది కాదు. ఆ వినోదం కారణంగానే సెకండాఫ్ ఊపు తగ్గినా క్షమించేయొచ్చు. ఓవరాల్ గా చూస్తే టిల్లు క్యారెక్టరైజేషన్.. ఆ పాత్రలో సిద్ధు నటన.. డైలాగ్స్ కోసం ‘డీజే టిల్లు’పై ఒక లుక్కేయొచ్చు. ట్రైలర్ దగ్గరే ఈ క్యారెక్టర్ ఇంప్రెస్ చేయని పక్షంలో దీనికి దూరంగా ఉండటం మంచిది.

నటీనటులు:

సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా అడుగులేస్తున్నాడు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో అతడికి కనెక్టయిన వాళ్లకు ఈ సినిమాతో అతను మరింతగా నచ్చేస్తాడు. టిల్లు పాత్రతో అతను కొత్త అభిమానులను కూడా సంపాదంచుకుంటాడు. నటనలో.. డైలాగ్ డెలివరీలో అతడికో టిపికల్ స్టైల్ ఉంది. అది యువతకు బాగా నచ్చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ అర్బన్ యూత్ ఈ సినిమాతో మరింతగా కనెక్టవుతారు. హీరోయిన్ నేహా శర్మ.. ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోలిస్తే అన్ని రకాలుగా మెరుగ్గానే కనిపించింది. కానీ ఆరంభంలో ప్రత్యేకంగా కనిపించే ఈ క్యారెక్టర్.. తర్వాత మామూలుగా మారిపోతుంది. చివరికొచ్చేసరికి నేహా వేయాల్సినంత ఇంపాక్ట్ వేయలేదనిపిస్తుంది. బ్రహ్మాజీ కనిపించిన కాసేపూ బాగానే ఎంటర్టైన్ చేశాడు. ప్రిన్స్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. హీరో తండ్రిగా చేసిన నటుడు బాగా నటించాడు. కిరీటి.. నర్రా శీను.. ప్రగతి.. వీళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:

శ్రీ చరణ్ పాకాల పాటలు బాగున్నాయి. పట్టాస్ పిల్లా ప్రత్యేకంగా అనిపిస్తుంది. రామ్ మిర్యాల స్వరపరిచిన టైటిల్ సాంగ్ సినిమాకు మేజర్ హైలైట్లలో ఒకటి. తమన్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ థీమ్ ను వాడుకున్న తీరు బాగుంది. సాయిప్రకాష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. చిన్న సినిమా అయినప్పటికీ సితార వాళ్ల స్థాయికి తగ్గట్లు నిర్మాణ విలువలు ఉన్నాయి. సిద్ధు-విమల్ కృష్ణ కలిపి వండిన స్క్రిప్టులో ఏమంత విశేషం కనిపించదు. కథ కొన్ని చోట్ల మరీ సిల్లీగా అనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్.. డైలాగుల మీదే సినిమా నడిచింది. ఇందుకు సిద్ధుకు క్రెడిట్ ఇవ్వాలి. దర్శకుడు విమల్ కృష్ణ కొన్ని చోట్ల కామెడీని డీల్ చేయడంలో ప్రతిభను చాటుకున్నాడు. కథను ఆసక్తికరంగా నరేట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు.

చివరగా: కథ వీక్ అయినా.. టిల్లు సూపర్

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre