#సంక్రాంతి.. నిర్మాతలపై పంపిణీదారుల ఒత్తిడి!

Sat Dec 05 2020 13:00:01 GMT+0530 (IST)

Distributors put pressure on Tollywood producers

ఎనిమిది నెలల క్రైసిస్ ని తట్టుకుని సినీరంగం నెమ్మదిగా బయటపడే ప్రయత్నం చేస్తోంది. షూటింగులు మొదలయ్యాయి.. థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు. కరోనా భయాల నడుమ జనం థియేటర్లకు వస్తారా రారా? అన్న సందిగ్ధత నడుమ ఫర్వాలేదనిపించే ఆక్యుపెన్సీ హోప్ పెంచుతోంది. హైదరాబాద్ - విజయవాడ- వైజాగ్ - శ్రీకాకుళం ప్రతి నగరంలోనూ థియేటర్లలో నిర్ధేశించిన టిక్కెట్లు అమ్ముడవుతున్నాయన్న సమాచారంతో ఎగ్జిబిటర్లు.. పంపిణీదారుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయడం అనే ఫార్ములా ఇప్పుడున్న బడ్జెట్లకు వర్కవుటవ్వదన్న విశ్లేషణ సాగుతోంది.దీంతో ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు ఎగ్జిబిటర్లు ప్రభుత్వ అనుమతిని కోరతారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఎవరేం చేసినా కరోనా ముప్పు నుంచి దూరంగా ఉన్నప్పుడే ప్రతిదీ పాజిబుల్. ఇలాంటి టైమ్ లో క్రిస్మస్ సంక్రాంతి కి ఏఏ సినిమాలు రిలీజవుతున్నాయి? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఎనిమిది నెలల క్రైసిస్ అనంతరం థియేటర్లలో రిలీజవుతున్న క్రేజీ చిత్రంగా సోలో బ్రతుకే సో బెటర్ వస్తోంది. సాయి తేజ్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.

అయితే సంక్రాంతి రిలీజ్ ల సంగతేమిటి? అంటే.. థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతులు ఇచ్చినా ఇంకా సంక్రాంతి విడుదలలపై స్పష్టత లేదు. వకీల్ సాబ్- రెడ్- క్రాక్ - ఉప్పెన ప్రస్తుతానికి రేసులో ఉన్నా 50 శాతం ఆక్యుపెన్సీతో ఓకేనా? అన్న సందిగ్ధత నెలకొంది.

చిత్రనిర్మాతలు ఈ చిత్రాలను సంక్రాంతి కోసం విడుదల చేయడానికి వెనుకాడతారా?  లేక ధైర్యం చేసి రిలీజ్ చేస్తారా? అన్నదానిపై స్పష్ఠత రాలేదు. ప్రస్తుతానికి రకరకాలుగా ఊహాగానాలు ఉన్నాయి. సినీ పరిశ్రమను కాపాడటానికి ఈ చిత్రాలను విడుదల చేయాలని పలువురు పంపిణీదారులు ఇప్పటికే నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఎనిమిది నెలల సంక్షోభం నుంచి కాపాడే చిత్రాలివని అంతా నమ్ముతున్నారు.

సంక్రాంతి సీజన్ తప్పిపోవడం సరికాదు.. తప్పనిసరిగా రిలీజ్ చేయాలన్నది పంపిణీ వర్గాల నుంచి ఒత్తిడిని రెట్టింపు చేస్తుంది. వంద శాతం ఆక్యుపెన్సీ ఇవ్వకపోయినా సంక్రాంతికి ఏ ధరకైనా సినిమాలను విడుదల చేయాలని పంపిణీదారులు ఎగ్జిబిటర్లు చిత్రనిర్మాతలను అభ్యర్థిస్తున్నారు.

టికెట్ ధరలను పెంచే అవకాశంపైనా ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో అదనపు ప్రదర్శనలకు .. రేట్ల పెంపులకు ప్రభుత్వాలు పాజిటివ్ గానే స్పందిస్తున్నాయి. తద్వారా ఈ సీజన్లో పెట్టుబడులు తిరిగి రాబట్టుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇక టిక్కెట్ ధర పెంచుకుంటే 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా.. థియేటర్ అద్దెలు తక్కువగా ఉన్నపుడు కలిసొచ్చే అంశం అవుతుంది. అందువల్ల పండుగ సీజన్లో పెద్ద చిత్రాలను ప్రదర్శించడం చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా ఎగ్జిబిషన్ పరిశ్రమకు సహాయపడుతుంది. నిర్మాతలు త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అయితే కరోనా భయాలు ప్రజల్లోంచి తొలగించేందుకు చిత్రపరిశ్రమ ఎలాంటి ఎత్తుగడల్ని అనుసరిస్తుంది? అన్నది కూడా థియేటర్లు ఫిల్ చేయడాన్ని నిర్ణయిస్తుందని అంచనా వేస్తున్నారు.