మహేష్ కి దూరం అవుతున్న డైరెక్టర్లు?

Wed Feb 26 2020 10:45:17 GMT+0530 (IST)

Directors who are moving away from Mahesh?

తెలుగు సినిపరిశ్రమ అంతా హీరోల చుట్టూనే తిరుగుతోంది అనేది వాస్తవం. అయితే ఎంతగా హీరో చుట్టూ తిరిగే పరిశ్రమ అయినా దర్శకులకు ఉండే ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటుంది. వారిని ఎవరూ విస్మరించలేరు.  అయితే ఈమధ్య కొందరు స్టార్లకు దర్శకులు దూరం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.  అలాంటి స్టార్ హీరోలలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.మహేష్ కు  మొదటి నుంచి 'డైరెక్టర్స్ యాక్టర్' అనే టాగ్ ఉండేది.  స్క్రిప్ట్ కు ఒక్కసారి పచ్చజెండా ఊపిన తర్వాత డైరెక్టర్ పనిలో జోక్యం చేసుకోరని.. డైరెక్టర్ చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తారని ఇండస్ట్రీ లో అందరూ చెప్తుంటారు.  ఇప్పుడు కూడా ఆ విషయంలో మహేష్ ఏమీ మారలేదు కానీ మహేష్ కు ఎక్కువమంది దర్శకులు దూరం అవుతున్నారని అంటున్నారు.  పూరి జగన్నాధ్ చాలా కాలం మహేష్ తో 'జనగణమన' చేయాలని ప్రయత్నించినా పూరి ఫాం లో లేకపోవడంతో అవకాశం ఇవ్వలేదనే టాక్ ఉంది. 'పోకిరి' లాంటి ఇండస్ట్రీ హిట్.. 'బిజినెస్ మేన్'  లాంటి మరో హిట్ ఇచ్చిన పూరి తర్వాత కాలంలో మహేష్ కు దూరమయ్యారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ రెండు సినిమాలు చేశారు.  మొదట్లో సన్నిహితంగా మెలిగినప్పటికీ తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చాయని అంటున్నారు. ఇక సుకుమార్ తో జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. ప్రాజెక్ట్ పట్టలెక్కాల్సిన సమయం లో క్యాన్సిల్ అయింది.  సుకుమార్ వేరే ప్రాజెక్ట్ చూసుకోవాల్సి వచ్చింది.  తాజాగా వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అని వార్త రావడంతో  వంశీ కూడా దూరమైనట్టేనని అంటున్నారు.  'సరిలేరు నీకెవ్వరు' సమయం లో అనిల్ రావిపూడి తో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో  ఇప్పుడు గ్యాప్ వచ్చిందని అంటున్నారు.   ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమా చేయగలిగే సత్తా ఉన్న దర్శకులు చాలా తక్కువమంది.  వారిలో ఇంతమంది మహేష్ కు దూరంగా జరుగుతూ ఉండడం ఆలోచించాల్సిన విషయం అని.. ఇప్పుడు మహేష్ డైరెక్టర్స్ యాక్టర్ కాదని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.