ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి పోటెత్తుతున్న డైరెక్టర్లు!

Mon Aug 15 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Directors Interest in OTT Platforms

నిన్నమొన్నటి వరకూ ఓటీటీ సంస్థలు కంటెంట్ కోసం కళ్లు అరిగిపోయేలా ఎదురుచూశాయి. ఇప్పుడు తమ దగ్గరికి వస్తున్న కంటెంట్ లో తమకి నచ్చిన కంటెంట్ ను తీసుకునే స్థాయికి వచ్చేశాయి. ఒకప్పుడు బయట అంతగా అవకాశాలు లేని నటీనటులు .. సాంకేతిక నిపుణులు మాత్రమే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కనిపించేవారు. కానీ ఇప్పుడు స్టార్స్ కేటగిరిలో కనిపించే ఆర్టిస్టులు .. డైరెక్టర్లు కూడా ఈ ఫ్లాట్ పైకి వచ్చేస్తున్నారు. ఇక్కడ సినిమాల మాదిరిగా ఫ్లాపు ముద్రలు నిలబడవు. హడావిడిగా తీసిపారేయవలసిన అవసరం ఉండదు.కంటెంట్ పరంగా క్వాలిటీ విషయంలో .. దర్శకులకు ఇవ్వవలసిన పారితోషికం విషయంలో ఓటీటీ సంస్థలు వెనక్కి తగ్గడం లేదు. దాంతో ఈ దిశగా అడుగులు వేస్తున్న దర్శకుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

నాగచైతన్య హీరోగా 'థ్యాంక్యూ' చేసిన  విక్రమ్ కుమార్ ఆయన కథానాయకుడిగా 'దూత' అనే వెబ్ సిరీస్ చేశాడు. త్వరలోనే ఈ వెబ్  సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.  హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ వెబ్ సిరీస్ పలకరించనుంది. రీసెంట్ గా 'సీతా రామం' సినిమాతో హిట్ అందుకున్న హను రాఘవపూడి కూడా వెబ్ స్ సిరీస్ చేయడానికి గ్రీన్ స్ ఇగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

కృష్ణవంశీ కూడా తాను వెబ్ సిరీస్ ల దిశగా వెళుతున్నట్టుగా చెప్పాడు. 'రంగ మార్తాండ' సినిమాను విడుదలకు ముస్తాబు చేస్తున్న  ఆయన ఆ తరువాత భారీ బడ్జెట్ తో కూడిన ఒక వెబ్ సిరీస్ చేయనున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటంపై ఈ వెబ్ సిరీస్ సాగనుంది. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.

సీజన్ కి 10 ఎపిసోడ్స్  చొప్పున .. 5 సీజన్లలో ఈ వెబ్ సిరీస్ నడుస్తుందని సమాచారం. తెలంగాణ సాయుధపోరాటం చెరిగిపోని ఒక చరిత్ర. అందువలన ఈ వెబ్ సిరీస్ కి విశేషమైన ఆదరణ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక క్రిష్ నవలల్లోని కథలను .. చారిత్రక కథలను .. సామాజిక పరిస్థితులను అద్భుతంగా తెరకెక్కించగల సమర్థుడు. ప్రస్తుతం ఆయన 'హరి హర వీరమల్లు' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా విడుదల తరువాత ఆయన ఒక వెబ్ సిరీస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబధించిన సన్నాహాలు మొదలయ్యాయని కూడా అంటున్నారు.  ఒక వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ నిర్మితం కానుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో ఓటీటీ సెంటర్లు మరింత కళకళలాడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.