'కాళీ' ఎపిసోడ్ లో మరింత కాలేలా దర్శకురాలి షాకింగ్ వ్యాఖ్యలు

Wed Jul 06 2022 10:33:45 GMT+0530 (IST)

Director shocking comments to burn more in 'Kali' episode

సమాజం అంతకంతకూ సున్నితంగా మారుతున్న వేళ.. కొన్ని రంగాల్లోని వ్యక్తులు ఆచితూచి అన్నట్లు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్న విషయానికి సంబంధించి.. ఆయా వర్గానికి చెందిన వారు 'మనోభావాల' కోణంలో విషయాన్ని చూస్తున్న వైనం ఇప్పుడు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలతో సంబంధాలు ఉండే రంగాల్లో ఉన్నవారు.. తమ పనితో ఎవరిని నొప్పించని రీతిలో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరింత రచ్చగా మారటంతో పాటు.. ప్రజల్లో చీలికలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి.తాజాగా 'కాళి' చిత్రానికి సంబంధించి.. కాళికదేవి రూపంలో ఉన్న పాత్ర సిగిరెట్ తాగుతున్న ఒక పోస్టర్ ను విడుదల చేయటం..అది కాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారటం తెలిసిందే. ఈ మొత్తం రచ్చకు కారణమైన దర్శకురాలు కమ్ రచయత్రి లీనా మణిమేగలై పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.

ఈ పోస్టర్ ను తప్పు పడుతూ.. మతపరమైన మనోభావాల్ని దెబ్బ తీయటంతో పాటు.. నేరపూరిత కుట్ర.. శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం లాంటి అభియోగాలపై ఆమెపై కేసులు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. ఈ పోస్టర్ పై పెద్ద ఎత్తున దుమారం రేగటంతో 'అరెస్టు లీనా మణిమేగలై' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

తమిళనాడులోని మధురైలో పుట్టిన లీనా.. ఇప్పుడు టొరంటోలో ఉంటున్నారు. టొరంటో అగాఖాన్ మ్యూజియంలోని రిథమ్స్ ఆఫ్ కెనడా విభాగానికి చెందిన ఈ మూవీలో వివాదాస్పద సీన్ ఎందుకన్న విషయం సినిమా చూస్తే అర్థమవుతుందని చెబుతున్నారు. గతంలో దేవతామూర్తులతో సన్నివేశాల్ని చిత్రీకరించే వేళలో.. సదరు పాత్రధారి సైతం స్వీయ నియమ నిబంధనలతో పాటు.. నాన్ వెజ్ తినకుండా ఉండటం.. మద్యం సేవించకుండా ఉండటం లాంటివి చేసేవారు.

ఇప్పుడేమో ఏకంగా సదరు పాత్రల చేతనే సిగిరెట్ తాగించటం లాంటివి చేయటమే కాదు.. ఎందుకలా చేశామో తెలుసుకోవాలంటే సినిమా చూడాలని చెప్పటం గమనార్హం. కారణం ఏదైనా కానీ ఇలాంటి సన్నివేశాలు ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. అయితే.. తాజా వివాదంపై దర్శకురాలు లీనా రియాక్షన్ వేరుగా ఉంది. తాను నమ్మిన విషయాన్ని బతికున్నంతవరకు నిర్భయంగా చెబుతానని.. అందుకు తన ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా వెనక్కి తగ్గని ఆమె చెబుతున్నారు.

పోస్టర్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వారు సైతం.. తన చిత్రాన్ని చూశాక.. లవ్ యూ లీనా అనటం ఖాయమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కెనడాలోని హిందూ సమాజం నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో భారత హైకమిషన్ స్పందించింది. కాళీ పోస్టర్ పై ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మత విశ్వాసాల్ని రెచ్చగొట్టేలా ఉన్న పోస్టర్ ను తొలగించాలని కెనడా అధికారుల్ని.. ఈవెంట్ నిర్వహాకుల్ని సూచన చేసింది. మరి.. ఈ వినతిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.