శంకర్ RC15 వదిలేసి భారతీయుడి కోసం..?

Fri Aug 05 2022 20:37:00 GMT+0530 (IST)

Director shankar movie news

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో శంకర్ `భారతీయుడు`కు సీక్వెల్ గా `ఇండియన్ 2`ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రకుల్ సిద్ధార్ధ్ కీలక పాత్రల్లో లైకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసిన ఈ మూవీ క్రేన్ యాక్సిడెంట్ కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత మేకర్స్ కు శంకర్ కు మధ్య మనస్పర్తలు తారా స్థాయికి చేరి సినిమా నిర్మాణాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి.అయితే ఇటీవల టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ ప్రకటించిన నేపథ్యంలో దర్శకుడు శంకర్ `ఇండియన్ 2` చిత్రీకరణకు వెళ్లడానికి రెడీ అవుతున్నారంటూ వార్తలు వినిపించాయి.

దీని కారణంగా రామ్ చరణ్ ఆర్.సి 15 షూటింగ్ ని ఆపేశారంటూ కథనాలొచ్చాయి. `ఇండియన్ 2` సెట్స్ కి వెళ్లబోతున్నానంటూ అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన రీఎంట్రీ గురించి ప్రస్థావిస్తూ కాల్షీట్ల వివరాల్ని వెల్లడించడంతో ఆకస్మికంగా చరణ్ అభిమానుల్లో బోలెడన్ని డౌట్లు పుట్టుకొచ్చాయి.

శంకర్ భారతీయుడు 2 సెట్స్ కి వెళితే ఇక చెర్రీ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం చాలా కాలం పాటు హోల్డ్ లో పడిపోయినట్టేనని అంతా టెన్షన్ కి గురయ్యారు. కానీ ఇది నిజమా? అంటే కానేకాదని తెలిసింది.

శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాకి చిన్నపాటి బ్రేక్ ఇస్తాడు.. అంతే. కమల్ హాసన్ తో `ఇండియన్ 2` ని తిరిగి ప్రారంభిస్తాడు. కానీ దానిని పూర్తి చేయడు. ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ లు హోల్డ్ లో ఉన్నందున `ఇండియన్  2` తో ముందుకు వెళ్లి 10 నుండి 12 రోజుల పాటు షూటింగ్ చేయాలని శంకర్ నిర్ణయించుకున్నారని తెలిసింది.

తెలుగు సినిమాల షూట్ లకు అనుమతి లభించిన తర్వాత RC15తో శంకర్ మళ్లీ ట్రాక్ లోకి వస్తాడు. రామ్ చరణ్ - కియరా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు టాప్ స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసారని కూడా కథనాలొచ్చాయి. శంకర్ తిరిగి ఆర్.సి 15 ని ప్రారంభిస్తే శరవేగంగా పెండింగ్ చిత్రీకరణను పూర్తిచేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ `ఇండియన్ 2` పెండింగ్ చిత్రీకరణ కోసం వెళతారట.