విక్రమ్ 'ధూత' తో ఆగడం లేదట..!

Wed Jun 29 2022 08:00:01 GMT+0530 (IST)

Director Vikram K Kumar

విభిన్నమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు మరియు తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్. ఈయన దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో వైపు ఈయన నాగ చైతన్య ముఖ్య పాత్రలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ధూత అనే వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించిన విషయం తెల్సిందే.థాంక్యూ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్లాన్స్ ను తెలియజేశాడు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా పేర్కొన్నాడు. అంతే కాకుండా రెండు వెబ్ సిరీస్ లను కమిట్ అయినట్లుగా కూడా పేర్కొన్నాడు. ధూత తర్వాత అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్స్ ల కోసం రెండు వెబ్ సిరీస్ లను చేయబోతున్నాడట.

24 వంటి విభిన్నమైన సినిమా లు వెబ్ సిరీస్ లో అయితే సూపర్ గా ఉంటాయి అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. అంతే కాకుండా ఈయన చాలా విభిన్నమైన స్క్రిప్ట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా గతంలో మంచి సక్సెస్ లను దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే తరహా లో వెబ్ సిరీస్ లతో కూడా విక్రమ్ కే కుమార్ ఓటీటీ ప్రేక్షకులకు చేరువ అవుతాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ధూత వెబ్ సిరీస్ సక్సెస్ అయితే భారీ బడ్జెట్ తో విక్రమ్ కే కుమార్ తో వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు పలువురు ప్రముఖ నిర్మాతలు మరియు ఓటీటీ లు ముందుకు వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధూత వెబ్ సిరీస్ నే దాదాపుగా 40 కోట్లకు మించిన బడ్జెట్ తో రూపొందించారట.

మనం.. ఇష్క్ తో పాటు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమా లను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్ థాంక్యూ సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ధూత వెబ్ సిరీస్ తో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈయన ధూత తో వెబ్ సిరీస్ లను మానేయకుండా మరిన్ని వెబ్ సిరీస్ లను చేసే ఉద్దేశ్యంతో ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.