Begin typing your search above and press return to search.

విజయ్,పవన్, బన్ని.. మూడు కుర్చీలాట

By:  Tupaki Desk   |   4 May 2021 12:30 PM GMT
విజయ్,పవన్, బన్ని.. మూడు కుర్చీలాట
X
ఇటీవల ‘మహర్షి’ చిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్నారు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి. మహేష్ వంటి సూపర్ స్టార్ తో సినిమా తీసి హిట్ కొట్టినా, అవార్డ్ అందుకున్నా ఆయన కెరీర్ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని మళ్లీ మహేష్ తోనే చేద్దామని చాలా ప్రయత్నం చేసారు. అలాగే రామ్ చరణ్ తోనూ అనుకున్నారు కానీ అది ముందుకు వెళ్లలేదు. ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం వంశీ పైడిపల్లికి హీరో దొరికేసాడు సైన్ చేసేసాడు..ఇక మొదలెట్టడమే ఆలస్యం అనే విధంగా వార్తలు వచ్చాయి. ఆ హీరో మరెవరో కాదు ‘మాస్టర్‌’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన హీరో తమిళ స్టార్‌ హీరో విజయ్‌.

వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా అనగానే.. ఇప్పుడు ఇటు టీ-టౌన్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఇదే హాట్‌ టాపిక్ గా మారిపోయింది‌. ఈ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌, హీరోల కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతోందని అందరూ కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు. అయితే ఈ లోగా మరో వార్త బయిటకు వచ్చింది. వంశీ పైడిపల్లి ఓ స్క్రిప్టు రాసుకుని బన్నిని ఎప్రోచ్ అవుతున్నారట. బన్నీకు ఆ స్టోరీ లైన్ తెగ నచ్చేసిందిట. ప్రస్తుతం ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నారట. ఈ వార్త నిజమే అంటున్నారు మీడియాలో ఓ వర్గం . ఒకవేళ ఈ కాంబినేషన్‌లో సినిమా ఖరారు అయితే మాత్రం ఇక సినీ అభిమానులకు పండగే అనడంలో సందేహం అనవసరం.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ‘వకీల్‌సాబ్‌’తో మంచి హిట్‌ అందుకున్న పవన్‌ కల్యాణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి ఒక సినిమా చేయబోతున్నట్లు సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రానికి సంబంధించి ఇప్పటికే నిర్మాత దిల్‌రాజుకు కథ వినిపించగా ఆయన ఓకే అన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకడంతో క్వారంటైన్‌లో ఉన్న పవన్‌ కల్యాణ్‌ కోలుకున్న తర్వాత కథ విననున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ వార్తలన్నింటిలో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటనలు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.