ఆత్రేయ ప్రెస్ మీట్.. కోవా ఆనమార్ఫిక్ లెన్స్!

Tue Jun 25 2019 17:57:52 GMT+0530 (IST)

ఎఐబీ వీడియోస్.. హానెస్ట్ ఇంజనీరింగ్ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ వీడియోస్ తో డిజిటల్ స్పేస్ లో గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'.  ఈమధ్యే రిలీజ్ అయిన ఈ సినిమాకు అటు క్రిటిక్స్ నుండి ఇటు ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కింది.  తక్కువ బడ్జెట్ తో కొత్తదనంతో సినిమాను తెరకెక్కించిన టీమ్ కు ప్రశంసలు లభిస్తున్నాయి.  హీరో నవీన్ నటనను చాలామంది మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ కు ఒక టాలెంటెడ్ హీరో దొరికాడని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.  ఇక దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జే ను కూడా మెచ్చుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ తదితరులు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' టీమ్ తో కలిసి రీసెంట్ గా ఎఎంబీ సినిమాస్ లో చూడడం జరిగింది. షో పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ సినిమా బాగుందని విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.  నవీన్ పోలిశెట్టికి విజయ్.. తరుణ్ భాస్కర్ బ్యాచ్ అందరూ పరిచయం ఉంది.  సినిమా ఇండస్ట్రీకి వచ్చినసమయం నుండి నవీన్ కు విజయ్ క్లోజేనట. దీంతో ప్రెస్ మీట్ సరదా సరదాగా సాగింది.

ఈ సినిమా గురించి ప్రశంసిస్తూ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. "ఆ ఏస్థటిక్స్.. నెల్లూరు యాస నాకు నచ్చింది.. వాళ్లు కోవా ఆనమార్ఫిక్ లెన్స్(Kowa Anamarphic lens) వాడారు.  నేను కూడా అది వాడాలనుకున్నాను" అంటూ ఫ్లోలో ఇంగ్లీష్ లో చెప్తుంటే విజయ్ డిస్టర్బ్ చేస్తూ "అది నాకే తెల్వదు.. వాళ్లకేం తెలుస్తది?" అని పంచ్ వేయడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వుల్లో మునిగిపోయారు.  తరుణ్ కూడా ఆ జోక్ ను స్పోర్టివ్ గా తీస్కోని "అరె.. ఒక లెన్స్ వాడినరు.. మంచిగుండె అది" అని అసలు భాషలోకి దిగిపోయి విజయ్ వైపుకు తిరిగి వివరించాడు.  అంతటితో ఆగకుండా "ఏమర్థం అయితది మీకు యాక్టర్స్ కు. ఏం ఆర్థం కాదు. మా బాధలు మేం పడుతుంటము" అని రివర్స్ పంచ్ వేస్తూ నవ్వాడు. ఇంతలో పక్కనెవరో ఒకరు అది 'పాలకోవా లెన్స్' అన్నారు.  ఓవరాల్ గా అది ప్రెస్ మీట్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ మీట్ లాగా ఉండడం గమనార్హం!