సాహో సుజీత్ రెండో సినిమా బాలీవుడ్ లో..

Wed Feb 24 2021 11:00:01 GMT+0530 (IST)

Director Sujeeth Upcoming Movies Updates

బాహుబలి స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా `సాహో`ని తెరకెక్కించాడు సుజీత్. 24 వయసులోనే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీని తెరకెక్కించడం సంచలనమే అయ్యింది. కనీసం ఇండస్ట్రీలో అసిస్టెంటుగా కూడా పని చేయకుండా ఇలాంటి డేర్ ఫీట్ వేయగలిగింది బహుశా సుజీత్ ఒక్కడే అని ప్రశంసిస్తే తప్పు కాదు. అంతకుముందు శర్వానంద్ తో రన్ రాజా రన్ అనే ఒకే ఒక్క సినిమా తీశారు సుజీత్. తొలి ప్రయత్నం బ్లాక్ బస్టర్ అందుకుని ప్రభాస్ నుంచి ఆఫర్ దక్కించుకున్నారు. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో ఒక అప్ కం దర్శకుడు సాహసాలు చేశారనే చెప్పాలి. టెక్నికల్ గా సాహో స్థాయి అందరినీ మెప్పించింది.కానీ స్క్రీన్ ప్లే పరమైన పొరపాట్లు.. అనుభవ రాహిత్యం తెరపై కనిపించడం సుజీత్ కి మైనస్ అయ్యింది. సాహో హిందీ లో సక్సెసైనా ఇతర చోట్ల ఆశించిన వసూళ్లను తేలేదు. ఆ తర్వాత అతడు రకరకాల ప్రయత్నాలు చేశాడు. చిరంజీవి కథానాయకుడిగా లూసీఫర్ రీమేక్ చేస్తాడని.. అలాగే ఛత్రపతి హిందీ రీమేక్ కి అతడి పేరు పరిశీలనలో ఉందని ప్రచారమైంది. కానీ అవేవీ సెట్ కాలేదు.

ఎట్టకేలకు తన తదుపరి చిత్రం హిందీలో లాక్ అయ్యింది. ఆ మేరకు జీ స్టూడియోతో సుజీత్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రొడక్షన్ హౌస్  ఈ విషయాన్ని అధికరికంగా ప్రకటించింది. ఇప్పటికే సుజీత్ తన స్క్రిప్టును `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్` ఫేమ్ విక్కీ కౌషల్ కు స్క్రిప్ట్ వినిపించారు. సుజిత్ ఈసారి కూడా మరో యాక్షన్ థ్రిల్లర్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలో ప్రకటించనున్నారు. 2022లో సినిమా విడుదలయ్యేలా తేదీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

నవతరంలో `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ వంగా తరువాత బాలీవుడ్ లో కెరీర్ కొనసాగించడానికి ముంబైకి వెళ్లిన రెండవ తెలుగు దర్శకుడిగా సుజీత్ పేరు మార్మోగుతోంది. బాలీవుడ్ లో తొలి ప్రయత్నమే సందీప్ వంగాలానే పెద్ద సక్సెస్ సాధించి కెరీర్ పరంగా పెద్ద స్థాయిని అందుకోవాలని ఆకాంక్షిద్దాం. ఇటీవల తన ప్రియురాలిని వివాహం చేసుకున్న సుజీత్ తన స్థావరాన్ని ముంబైకి మార్చడం టాలీవుడ్ లో చర్చకు వచ్చింది.