Begin typing your search above and press return to search.

హాలీవుడ్ తో పోటీప‌డే యాక్ష‌న్ సినిమాలు తీయ‌గ‌లం

By:  Tupaki Desk   |   24 March 2023 2:00 PM GMT
హాలీవుడ్ తో పోటీప‌డే యాక్ష‌న్ సినిమాలు తీయ‌గ‌లం
X
ఏ రంగంలో అయినా పోటీ అనేది ఆరోగ్య‌క‌రంగా ఉండాలి. ఒకరిని మించి ఇంకొక‌రు ఎలా ఎద‌గాల‌నే నైతికత అవ‌స‌రం. ఒక‌రిని తొక్కి ఇంకొక‌రు ఎద‌గ‌డం అనే అనైతిక విధానం కంటే ఇరుగు పొరుగు ఎదుగుద‌ల‌ను ఆకాంక్షిస్తూ `స్కై ఈజ్ లిమిట్` అన్న చందంగా ఎదిగే వాళ్లు అంద‌రిలో స్ఫూర్తిని నింపుతారు. ఈ నైతిక‌త విలువ‌ల‌కు సంబంధించిన ఫార్ములా ఇటు భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌ర్తిస్తుంది.

ఇటీవ‌ల ముఖ్యంగా ఉత్త‌రాది ద‌క్షిణాది డివైడ్ టాపిక్ సినీపరిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ పై టాలీవుడ్ డామినేష‌న్ గురించి చ‌ర్చ విస్త్ర‌తంగా సాగింది. బాహుబ‌లి-బాహుబ‌లి 2- కేజీఎఫ్‌- కేజీఎఫ్ 2 - ఆర్.ఆర్.ఆర్ సినిమాల‌తో వెయ్యి కోట్ల క్ల‌బ్ ప‌రిశ్ర‌మ‌లుగా తెలుగు-క‌న్న‌డ రంగాలు పాపుల‌ర‌య్యాక ఈ విభ‌జ‌న మ‌రింత ఎక్కువైంది.

అయితే ఇటీవ‌ల ముంబైలో ద‌స‌రా సినిమాని ప్ర‌మోట్ చేస్తూ నేచుర‌ల్ స్టార్ నాని ఒక మాట‌న్నారు. హిందీ సినిమా మాది.. తెలుగు సినిమా మీది! అంటూ యూనివ‌ర్శ‌ల్ థాట్ ని బ‌హిరంగ వేదిక‌పై ఆకాంక్షించిన తీరు ఆక‌ట్టుకుంది. ఇదే ఫార్ములాను అనువ‌ర్తింప‌జేస్తే హాలీవుడ్ కొలాబ‌రేష‌న్ తో భార‌తీయ సినిమా ఎద‌గాల‌న్న ఆకాంక్ష బ‌ల‌ప‌డ‌డం అర్థ‌వంత‌మైన‌ది.

`పఠాన్` దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు అలాంటి ఒక ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. మేం హాలీవుడ్ స్థాయిలో పెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ లను తీయగలమ‌ని ఆయ‌న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ వార్ -పఠాన్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు అసాధార‌ణ‌ హిట్ లను అందించారు.

ప‌ఠాన్ ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ అద్భుతమైన ఫీట్ తో సిద్ధార్థ్ ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగారు. నిజానికి సిద్ధార్థ్ దూరదృష్టి గల ఎస్.ఎస్.రాజమౌళి .. ఎస్.శంక‌ర్ (రోబో శంక‌ర్) ల‌ త‌ర్వాత అంత‌టి ప్ర‌తిభావంతుడైన దర్శకుడు. హిందీ ఫార్మాట్ లో 500 కోట్ల నెట్ కలెక్షన్ క్లబ్ అత‌డికి సులువుగా చిక్కుతోంది.

సిద్ధార్థ్ కు యష్ రాజ్ ఫిల్మ్స్ కు చెందిన ఆదిత్య చోప్రా బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్య‌త‌ల‌ను అత‌డు స‌క్ర‌మంగానే నిర్వ‌ర్తించాడు. ఈ రోజు భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో పఠాన్ - వార్ చిత్రాల‌తో యాక్షన్ జానర్ స్పెష‌లిస్ట్ గా మార్గదర్శకుడిగా ఎదిగాడు. సిద్ధార్థ్.. యాక్షన్ ఎంటర్ టైనర్ నైపుణ్యం ఇక‌పై మ‌రో స్థాయికి చేరుకోనుంది.

హై-ఆక్టేన్ గూఢచారి చిత్రాలలో సూపర్ స్టార్ లు షారూఖ్ ఖాన్ - హృతిక్ రోషన్ లకు అతిపెద్ద హిట్ లను అందించాక అత‌డు దేశంలోని బ‌డా స్టార్ల‌ను క‌లుపుకుంటూ మ‌ల్టీవ‌ర్స్ ల‌ను ప్లాన్ చేస్తుండ‌డంతో క్రేజ్ మ‌రో లెవ‌ల్ కి చేరుకోనుంది. ఇవి హాలీవుడ్ స్థాయిలో మైమ‌రిపిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

సిద్ధార్థ్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు. తన నిర్మాణ సంస్థ మార్ఫ్లిక్స్ సంస్థ‌లో హృతిక్ రోషన్ - దీపికా పదుకొనే నాయ‌కానాయిక‌లుగా భారతదేశ‌ మొదటి వైమానిక యాక్షన్ చిత్రాన్ని అందించ‌నున్నాడు. మార్ఫ్లిక్స్ బ్యాన‌ర్ తో సిధ్ కి చాలా ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి. హాలీవుడ్ తో సమానంగా కంటెంట్ ని ఉత్పత్తి చేసే ప్రొడక్షన్ హౌస్ గా నిర్మించాలనేది నా కల అని అత‌డు తెలిపాడు. ``ఫైటర్ తో నా ఉద్దేశం నెర‌వేరుతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను`` అని అన్నాడు. ఒక భార‌తీయుడిగా నేను హాలీవుడ్ కౌంటర్ పార్ట్ లంత పెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ లను చేయగలన‌ని భావిస్తున్నాను.

మ‌న‌ పరిశ్రమకు ఆకాశమే హద్దు అని నేను ఎప్పుడూ విశ్వసిస్తున్నాను.. అని సిద్ధార్థ్ ఆత్మ‌విశ్వాసాన్ని క‌న‌బ‌రిచారు. మునుముందు ఎస్.ఎస్.రాజ‌మౌళి - ఎస్.శంక‌ర్ స‌హా సిద్ధార్థ్ ఆనంద్ హాలీవుడ్ స్థాయి సినిమాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను అల‌రిస్తార‌న‌డంలో సందేహం లేదు. ఆ ముగ్గురూ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. రాజ‌మౌళి-శంక‌ర్- సిద్ధార్థ్ ఆనంద్ మ‌ధ్య ముక్కోణ పోటీ ఆరోగ్య‌క‌ర‌మైన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్లకు దారి తీస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఒక ఆహ్లాద‌క‌ర‌మైన పోటీత‌త్వంతో ఆ ముగ్గురూ భార‌తీయ సినిమాని మ‌రో స్థాయికి చేర్చాల‌ని ఆకాంక్షిద్దాం.