తలైవా ఫ్యాన్స్ మనసు గెలిచిన డైరెక్టర్

Sun Dec 08 2019 13:10:58 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ చిత్రం `దర్బార్`. నయనతార కథానాయిక. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లిరాజా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. శనివారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో  ఆడియో రిలీజ్ ఫంక్షన్ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ తలైవర్ రజనీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు టైమ్ విలువ తెలుసని గతంలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా గుర్తు  చేసి అభిమానుల మనసు గెలుచుకున్నారు.పూణేలో `శివాజీ` చిత్రానికి సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాం. లంచ్ బ్రేక్ ఇచ్చాం. ఆ సమయంలో అక్కడున్న వారంతా భోజనం కోసం కారవాన్ వద్దకు వచ్చారు. అయితే రజనీ సార్ మాత్రం లొకేషన్ లోనే భోజనం చేశారు. కారవాన్ వద్దకు వచ్చి మళ్లీ లొకేషన్ కి వెళ్లాలంటే దాదాపు 20 నిమిషాలకు మించి సమయం పడుతుంది. ఆ సమయాన్ని వృధా చేయకూడదని రజనీ సర్ అక్కడే భోజనం చేశారు. అయితే ఆ ప్లేస్ ఏమాత్రం అంత బాగా లేదు. అయినా సమయాన్ని వృధా చేయకూడదన్న భావనతో ఆ పరిసరాలు ఇబ్బందికరంగా వున్నా ఎంతో ఓర్పుగా అక్కడే భోజనం చేసి తనేంటో చెప్పకనే చెప్పారు. అదీ రజనీ అంటే... అంటూ శంకర్ ఎమోషన్ అయ్యారు.

ఎప్పుడో జరిగిన ఆ విషయాన్ని శంకర్ ఇప్పటికీ గుర్తుంచుకోవడం విశేషం. అనవసర హంగులకు దూరంగా ఎంతో సింపుల్ గా ఉండే రజనీకాంత్ ఇప్పటికీ తాను బస్ కండక్టర్ గా పని చేసిన రోజుల్ని గుర్తు చేసుకుంటారు. ఇక అభిమానులతో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండడానికి ఆయన డౌన్ టు ఎర్త్ నైజం కారణం.