పైరసీ చూస్తే డబ్బులిమ్మన్న దర్శకుడు

Mon May 27 2019 11:29:39 GMT+0530 (IST)

Director Cheran Plan For Thirumanam Piracy Audience

ఇండస్ట్రీకి శాపంగా పరిణమించిన పైరసీ భూతాన్ని వదిలించడం ఎవరి వల్ల కావడం లేదు. పైపెచ్చు టెక్నాలజీ పుణ్యమా అని ఇంకా కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త సినిమా విడుదలైన మధ్యానానికే ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్లు ప్రత్యక్షం కావడం చూసి నిర్మాతల గుండెలు ఆగిపోతున్నాయి. సరే వీటిని అరికట్టడం ప్రేక్షకులను బ్రతిమాలుకోవడం అయ్యే పనులు కావని గుర్తించిన తమిళ దర్శకుడు చేరన్ ఇటీవలే ఓ కొత్త పోకడకు తెరతీశాడు.ఈయన కొత్త సినిమా తిరుమానం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. క్రిటిక్స్ బాగానే ఉందన్నా జనానికి అందులో థీమ్ కనెక్ట్ కాలేదు. ఫలితంగా వసూళ్లు లేక త్వరగానే నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో ఫ్లాప్ ముద్ర వేయించుకుని చేరన్ కు బాడ్ మెమరీగా మిగిలింది. విచిత్రంగా ఈ సినిమాను ఆన్ లైన్ లో పైరసీ రూపంలో వీక్షించిన ప్రేక్షకులు బాగుందంటూ తమకు నచ్చిందంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవి చేరన్ దాకా వెళ్లాయి.

దీంతో అతను కొత్తగా ఆలోచించి మీరు పైరసీలో చూశారు సినిమా నచ్చింది కాబట్టి న్యాయంగా నిర్మాతకు వంద రూపాయలు పంపండి అంటూ ఆయన అకౌంట్ నెంబర్ నెట్ లో పెట్టేశాడు. దీనికి మంచి స్పందన దక్కింది. నిజంగానే జనం డబ్బులు పంపారు. ఎంత మొత్తం అనేది బయటికి రాలేదు కానీ ఈ ధోరణి గురించి ఇతర నిర్మాతల నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో జోకర్ అనే మరో సినిమా విషయంలో ఇలాగే చేస్తే 2 లక్షలు ప్రొడ్యూసర్ అకౌంట్ లో పడ్డాయి. కానీ చేరన్ బాగా పేరున్న దర్శకుడు కాబట్టి ఎక్కువ మొత్తమే వస్తుందని అంచనా. ఏ కోణంలో చూసినా ఇది తప్పే కానీ నిస్సహాయతలో ఏ నిర్మాతైనా ఇంతకన్నా ఏం చేయగలడు