Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేశారా...?

By:  Tupaki Desk   |   27 Jun 2020 12:10 PM GMT
వకీల్ సాబ్ ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేశారా...?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'వకీల్ సాబ్' మరో 20 రోజుల షూటింగ్ తో పూర్తవుతుందని సమాచారం. 'వకీల్ సాబ్' ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన దర్శకనిర్మాతలు దానికి తగ్గట్టుగానే షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే కరోనా వచ్చి వీరికి బ్రేక్స్ వేసింది. దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

కాగా ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేసుకోడానికి పర్మిషన్ ఇవ్వడంతో 'వకీల్ సాబ్' మిగతా భాగం షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది జరిగేలా కనిపించడం లేదు. రోజురోజుకి కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్‌ చేయడానికి ఇబ్బందిగా మారింది. కనీసం ఆగస్టు సెప్టెంబర్‌ లో అయినా షూటింగులకు వెసలుబాటు కలుగుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దిల్ రాజు తన పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్‌' రిలీజ్‌ పై కీలక నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

రాబోయే రోజుల్లో సినిమా షూటింగులు మొదలైనప్పటికీ 'వకీల్ సాబ్‌'ను ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. దీనికి కారణం కరోనా కారణంగా టాలీవుడ్‌ లో భారీ ప్రాజెక్టులు సెట్స్‌ పైకి వెళ్లడం లేట్ అవుతూ వస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా, రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్', బాలయ్య - బోయపాటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న 'వకీల్ సాబ్' ని కుదిరితే సంక్రాంతి రేస్ లో నిలపాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.