Begin typing your search above and press return to search.

బన్నీ సినిమా హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో దిల్ రాజు...?

By:  Tupaki Desk   |   7 July 2020 1:00 PM GMT
బన్నీ సినిమా హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో దిల్ రాజు...?
X
సినీ ఇండస్ట్రీలో రీమేక్ ల ట్రెండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కావడంతో రిస్క్ ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. దీనిని నిజం చేస్తూ రీమేక్‌ లు ఎక్కువ శాతం హిట్ అవ్వడమే కాకుండా నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ చిత్రాలను సౌత్ ఇండస్ట్రీ వారు రీమేక్ చేస్తుంటే మన చిత్రాల రైట్స్ బాలీవుడ్ మేకర్స్ పోటీపడి తీసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో హిట్ అయిన సినిమాల కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కాచుకొని కూర్చుంటున్నారు. ఇప్పటికే తెలుగులో సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేస్తే బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'జెర్సీ' 'ఆర్ ఎక్స్ 100' చిత్రాలు కూడా హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ హిట్ సినిమా 'అల వైకుంఠపురంలో' కూడా త్వరలో రీమేక్ కానుంది. ఇప్పుడు మరో తెలుగు హిట్ సినిమా హిందీలో రీమేక్ కాబోతోందని బీ టౌన్ జనాలు చర్చించుకుంటున్నారు.

కాగా అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'డీజే దువ్వాడ జగన్నాథం' సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద స్టామినా చూపించింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నడిచిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఇప్పుడు 'డీజే' బాలీవుడ్ లో మోగనుందట. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించే అవకాశాలున్నాయట. దీనికి సంబంధించి సిద్ధార్థ్ మల్హోత్రా తో చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా 'తడం' అనే తమిళ్ హిట్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు 'డీజే' రీమేక్ ని లైన్లో పెడుతున్నాడు. అయితే ఈ రీమేక్ ని 'డీజే' నిర్మాత దిల్ రాజు మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించాలని ప్లాన్స్ చేస్తున్నారట. ఇప్పటికే 'జెర్సీ' హిందీ రీమేక్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు 'డీజే' ని కూడా నిర్మించాలని అనుకుంటున్నాడట. అందుకోసమే ఇన్ని రోజులు ఈ మూవీ రైట్స్ అమ్మడానికి ముందుకు రాలేదట. మరి దిల్ రాజు సిద్ధార్థ్ మల్హోత్రాతో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడనే వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.