Begin typing your search above and press return to search.

ఒక్క‌డు సీక్వెల్ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్

By:  Tupaki Desk   |   22 Jan 2020 7:32 AM GMT
ఒక్క‌డు సీక్వెల్ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఒక్క‌డు` అప్ప‌ట్లో ఎంతటి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. రెండు గ్రూపుల మ‌ధ్య గ్యాంగ్ వార్... రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం...సెన్సిబుల్ ల‌వ్ స్టోరీ తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించారు. ప్ర‌తి స‌న్నివేశం సినిమాకు ప్రాణం పోసిన‌వే. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతం ప్ర‌ధాన అస్సెట్ అవ్వ‌డంతో మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీంతో ఒక్క‌డు మ‌హేష్ కెరీర్ లో మ‌ర‌పురాని మైలురాయిగా నిలిచింది. న‌టుడిగా మ‌హేష్ మైలేజ్ ని పెంచిన సినిమాగానూ ఒక్క‌డు పాపుల‌రైంది. మురారి త‌ర్వాత మ‌హేష్ కి గేమ్ ఛేంజర్ మూవీ ఇది.

ఆ త‌ర‌హా స్క్రిప్టుని ఇప్ప‌టివ‌ర‌కూ వేరొక ద‌ర్శ‌కుడెవ‌రూ ట‌చ్ చేయ‌నే లేదు. తాజాగా ఒక్క‌డు లాంటి అదిరిపోయే స్క్రిప్ట్ ఉంటే నా ద‌గ్గ‌ర‌కు తీసుకురండి. ఎన్ని కోట్లు ఖ‌ర్చ‌యినా నేను తీస్తానంటూ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ముందుకొచ్చారు. హీరోని ఎంపిక చేస్తాన‌ని అన్నారు. లేటెస్టుగా ఓ ఇంట‌ర్వూలో ఈ విష‌యాన్ని రాజు గారు ప‌బ్లిక్ గా ప్ర‌క‌టించారు. ఒక్క‌డు రిలీజ్ టైమ్ లోనే నిర్మాత‌గా ప‌రిచయం అవ్వాల‌ని రాజుగారు ఎంతో ఆత్రంగా వెయిట్ చేశార‌ట‌. దిల్ కి సంబంధించిన ప‌నుల్లో వినాయ‌క్ తో క‌లిసి ప‌ని చేస్తున్న రోజులు అవి అంటూ గుర్తు చేసుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నిర్మాత కావాల‌నుకున్న స‌మ‌యంలో ఒక్క‌డు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ఇలాంటి స్క్రిప్ట్ తో లాంచ్ అయితేనే బాగుండేద‌ని రాజుగారు అనుకున్నారుట‌. నిర్మాత‌గా ప‌రిచ‌య‌మైన త‌ర్వాత చాలా మంది హీరోల‌తో డిఫ‌రెంట్ క‌థ‌ల్ని ఎంచుకుని సినిమాలు తీసాన‌ని... కానీ ఒక్క‌డు లాంటి స్క్రిప్ట్ ఇన్నేళ్ల జ‌ర్నీలో ఏ ఒక్క‌రు తీసుకురాలేద‌ని అన్నారు. అలాంటి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని తెలిపారు. ఇలాంటి క‌థ‌- కంటెంట్ తో త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తే హీరోని కూడా తానే సెట్ చేస్తాన‌ని అన్నారు. ఒక వేళ ఆ త‌ర‌హా స్క్రిప్టు తెచ్చినా అది సీక్వెల్ అవుతుందేమో! మ‌రి ఆ జాక్ పాట్ కొట్టే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది చూడాలి.