అల్లరోడి సినిమాను అక్కడకు తీసుకు వెళ్లబోతున్న దిల్ రాజు

Sun Feb 28 2021 12:20:52 GMT+0530 (IST)

Dil Raju is going to take the movie Allari naresh there

అల్లరి నరేష్ హీరోగా సుదీర్ఘ కాలం తర్వాత సక్సెస్ దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు కామెడీ పాత్రలు చేసి మెప్పించలేక పోయిన అల్లరి నరేష్ నాంది సినిమాలో సీరియస్ గా నటించి ఆకట్టుకున్నాడు. నాంది సినిమా హిట్ టాక్ ను దక్కించుకుంది. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమా ఇంకా కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత ఈ సినిమా తో సక్సెస్ దక్కడంతో అల్లరి నరేష్ ఒకానొక సమయంలో ఎమోషనల్ అయిన విషయం తెల్సిందే. అల్లరి నరేష్ చేసిన నాంది సినిమాను ఇతర భాషలకు తీసుకు వెళ్లేందుకు దిల్ రాజు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు తాజాగా నాంది సినిమా రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు భాషల రీమేక్ రైట్స్ ను దిల్ రాజు కొనుగోలు చేశాడు. హిందీతో పాటు తమిళం.. కన్నడం మరియు మలయాళం రీమేక్ రైట్స్ ను కూడా దిల్ రాజు కొనుగోలు చేయడంతో అక్కడ ఎవరెవరితో ఈ సినిమాను చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద మొత్తంలో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం దిల్ రాజు ఖర్చు చేశాడని కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దాదాపుగా రూ.2.70 కోట్లకు గాను ఈ సినిమా రీమేక్ రైట్స్ అమ్ముడు పోయాయని మీడియా వర్గాల వారు చెబుతున్నారు.

ఇక దాదాపుగా రూ.5.5 కోట్ల రూపాయలను ఈ సినిమా వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను 2.65 కోట్ల రూపాయలకు ఆహా వారు కొనుగోలు చేశారు. శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లుగా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అల్లరోడి సినిమా సుదీర్ఘ కాలం తర్వాత నిర్మాత జేబులు నింపిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.