అలాంటి నిర్మాతల వల్లే మాలాంటి వాళ్లకు సమస్య వస్తోంది: దిల్ రాజు

Fri Jan 28 2022 09:00:01 GMT+0530 (IST)

Dil Raju In Pressmeet

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఓవైపు మీడియం రేంజ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా చిత్రాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో దాదాపు అర డజను ప్రాజెక్ట్స్ పనులు జరుగుతున్నాయి. అందులో పాన్ ఇండియా సినిమాలతో పాటుగా బాలీవుడ్ చిత్రాలు కూడా ఉండటం గమనార్హం. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న దిల్ రాజు.. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.కరోనా నేపథ్యంలోనూ హీరోలు అధిక రెమ్యూనరేషన్స్ తీసుకోవడం గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. దీంట్లో హీరోల తప్పేమీ లేదని.. ఇది వంద శాతం ప్రొడ్యూసర్స్ తప్పేనని అభిప్రాయపడ్డారు. ఓటీటీ రైట్స్ - డబ్బింగ్ రైట్స్ వల్ల హీరోల మార్కెట్ పెరిగిన మాట వాస్తవమేనని.. కానీ థియేట్రికల్ వల్ల వచ్చే డ్యామేజ్ ని కూడా కాలిక్యులేట్ చేసుకోగలగాలని అగ్ర నిర్మాత సూచించారు.

''నిర్మాతగా ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు దానికి తగిన బడ్జెట్ వేసుకోవాలి. మార్కెట్ ఎంత ఉంది? మిగులుతుందా లేదా? అనే లెక్కలు వేసుకోవాలి. చాలా మంది నిర్మాతలు తమకు ఏమీ మిగలకపోయినా పర్వాలేదు.. డేట్స్ ఇవ్వండి చాలు అని హీరోలను అడుగుతుంటారు. అలాంటి వారి వల్ల మాలాంటి వాళ్లకు కూడా సమస్య వస్తోంది'' అని దిల్ రాజు అన్నారు.

''నావరకు నేను కాలిక్యులేషన్ ప్రకారమే సినిమా తీస్తా. ఒక స్టార్ హీరోతో సినిమా చేసినా.. మా ఆశిష్ తో 'రౌడీ బాయ్స్' తీసినా నా లెక్కలు నాకు ఉంటాయి. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలంటే ఎకనామిక్ కాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సినిమాలో డబ్బు పోగొట్టుకునే పనైతే నువ్వు అసలు సినిమా ఎందుకు తీయాలి? హీరోకి 100 కోట్లు ఇచ్చి ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు.. ఒక ప్రొడ్యూసర్ గా సినిమా సక్సెస్ అయితే ఏమి మిగులుతుంది? ప్లాప్ అయితే ఏంటి? అనే లెక్కలు లేకుండా సినిమా తీయడం ఎందుకు?'' అని దిల్ రాజు ప్రశ్నించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''పాండమిక్ వల్ల ప్రొడ్యూసర్స్ కు చాలా నష్టం వచ్చింది. ఆ సమయంలో నేను నిర్మించే ప్రతీ సినిమా మీద దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు నాకు భారం పడింది. అది కేవలం వడ్డీలు - జీతాల రూపంలోనే. ఇది నాకు తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది?. హీరోతో మంచి రిలేషన్ ఉంటే వెళ్లి పరిస్థితి ఇదని చెప్పి అడుగుతా.. వాళ్ళు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ఓకే. తగ్గించకపోయినా ఓకే. ఎందుకంటే నా కమిట్మెంట్. పాండమిక్ వస్తుందని హీరోకి నాకు తెలియదు కదా?. కాకపోతే కొందరు హీరోలు తగ్గిస్తున్నారు. చాలా మంచిది. అదే ఒకరి కోసం ఒకరు నిలబడటం అంటే. అలాంటప్పుడే వారితో మంచి రిలేషన్ ఏర్పడుతుంది'' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఇక దిల్ రాజు ప్రొడక్షన్ విషయానికొస్తే.. ప్రస్తుతం 'ఎఫ్ 3' 'థాంక్యూ' సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అలానే రామ్ చరణ్ - శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ సెట్స్ మీద ఉంది. విజయ్ - వంశీ పైడిపల్లి కాంబోలో మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఇక హిందీ 'జెర్సీ' రీమేక్ నిర్మాణంలో భాగమైన దిల్ రాజు.. 'హిట్' హిందీ రీమేక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో 'ATM' అనే వెబ్ సిరీస్ తో స్టార్ ప్రొడ్యూసర్ డిజిటల్ స్పేస్ లో ఎంట్రీ ఇస్తున్నారు.