నిర్మాతలకు గౌరవం: నాడు.. నేడు.. ఏం మార్పు?

Wed May 27 2020 05:00:01 GMT+0530 (IST)

Respect for producers: onceupon .. Now .. what change?

మనకు జీతం ఇచ్చేవారు సాడిస్టు అయినా 1వ తారీఖు రాగానే సాలరీ పడగానే కష్టమంతా మరిచిపోయి అతడే దేవుడిలా కనిపిస్తాడు. ఎంత టార్చర్ పెట్టినా కానీ డబ్బులిచ్చేవారిని గుర్తు చేసుకుంటారు. వారి పట్ల అణుకువగా.. అభిమానంతో ఉంటారు. ఇక డబ్బులు పెట్టుబడి పెట్టి పదిమందికి ఉపాధి కల్పించే వారికి ఎక్కువ గౌరవం ఉంటుంది. అయితే అన్నింటా ఈ రూల్ వర్తిస్తుంది. కానీ సినిమా రంగంలో మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది. నిర్మాతలు పైసలు పెట్టే పనిమంతులుగా మారిపోయారు. ఎందుకీ దురావస్థ.. నాటికి నేటికి నిర్మాతల గౌరవం ఎందుకు పడిపోయింది.? ఎవరు పడగొట్టారు?*ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ లకు నిర్మాతలంటే గౌరవం
అవి ఎన్టీఆర్ ఏఎన్నార్ లు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రోజులు. వారి సినిమా జీవితంలో నిర్మాతలను దేవుళ్లగా భావించేవారు. వారికి అమితమైన గౌరవం ఇచ్చేవారు.హీరోలు సహా అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చి వారిని పోషించే నిర్మాతలంటే ఎన్టీఆర్ హయాంలో ఎంతో గౌరవం ఉండేది. నాడు నిర్మాతలే సినీ ఇండస్ట్రీలో అగ్రతాంబులం దక్కించుకునే వారు. విజయా వాహినీ సినీ సంస్థల నిర్మాతలు సహా చాలా మందికి ఆ క్రెడిట్ దక్కింది. ఎస్వీఆర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి నాటి స్టార్ హీరోలు సైతం నిర్మాతలకు సముచిత గౌరవం ఇచ్చేవారు. మూవీ మొగల్ రామానాయుడికి ఆ గౌరవం దక్కింది. నాటి ఖ్యాతిని గుర్తుచేసే ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటి నిర్మాతలు కూర్చీలో కూర్చుంటే.. స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ లు నేలపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ పిక్ నేటి మన స్టార్ హీరోలు దర్శకులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఎంత పెద్ద హీరోలైన నాటి వారు విజయ వాహినీ వంటి సంస్థలకు నెల జీతాలకు పనిచేసేవారు. అదీ నాటి నిర్మాతలకు దక్కిన గౌరవం..

*నేడు చెక్కులకు సంతకాలకే నిర్మాతలు..
పాత కాలానికి.. నేటికి సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు హీరోల డేట్స్ కోసం నిర్మాతలు వారి గేట్ ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాత పరిస్థితి క్యాషియర్ స్థాయికి దిగజారిపోయిందన్న ఆవేదన చాలా మంది నిర్మాతల్లో ఉంది. హీరోలు దర్శకుల ముందర చేతులు కట్టుకొని నిలబడాల్సిందేనని కొందరు నిర్మాతలు తరుచుగా వాపోతుంటారు. ఎన్టీఆర్ ఎఎన్నార్ లు ఇచ్చిన గౌరవంతో పోలిస్తే నేటి స్టార్ హీరోలు ఇస్తున్న గౌరవం ఇసుమంత కూడా కాదని టాలీవుడ్ లో కథలు కథలుగా చెబుతారు. ఇప్పుడు నిర్మాత అభిప్రాయానికి కనీస విలువ ఉండదని.. అంతా దర్శకులు హీరోలదేనని అంటున్నారు. వారు ఓకే అనుకున్నాక నిర్మాతను ఎంచుకొని డబ్బులు పెట్టమనడం తప్పితే సొంతంగా నిర్మాతలు అన్నీ వ్యవహరించేవారు ఒకరో ఇద్దరు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నారని చెబుతుంటారు. ప్రస్తుతం చెక్కులపై సంతకాలకే నిర్మాతలు పరిమితమైపోయిన దుస్థితి నెలకొంది.