ట్రిపుల్ ఆర్ సాధించలేనిది `కేజీఎఫ్ 2` సాధించిందా?

Thu May 12 2022 17:00:01 GMT+0530 (IST)

Did KGF2 achieve what RRR could not achieve

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన సంచలన చిత్రం `కేజీఎఫ్ 2`. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా వున్న అభిమానులు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కోవిడ్ కారణంగా పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 14న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో విడుదలైంది. కేజీఎఫ్ చాప్టర్ 1 సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో చాప్టర్ 2 పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ లభించాయి.ఇక్కడ నుంచే కేజీఎఫ్ రికార్డుల పరంపర మొదలు పెట్టింది. మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ `ట్రిపుల్ ఆర్` రిలీజ్ అయిన మూడు వారాల గ్యాప్ తరువాత వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతూ రికార్డులని తిరుగరాస్తోంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఎక్కడా తగ్గడం లేదు. వసూళ్ల సునామీని ఆపడం లేదు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ రికార్డుల్ని తిరగరాస్తూ విజయ దుందుభి మోగిస్తూనే వుంది.

హిందీలో ఇప్పటికే 400 కోట్ల మైలు రాయిని దాటి దంగల్ రికార్డుని బ్రేక్ చేసింది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా `బాహుబలి 2` నెలకొల్పిన రికార్డుపై కన్నేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాలీడ్ వసూళ్లని రాబడుతూ అత్యధిక వసూళ్లని రాబట్టిన డబ్బింగ్ సినిమాగా సరికొత్త రికార్డుని సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. వరుసగా రికార్డుల్ని తిరగరాస్తున్నా ఇప్పటికీ రాఖీ భాయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

బాక్సాఫీస్ వద్ద అదే జోరుని కొనసాగిస్తూ బారీ వసూళ్ల దిశగా పయనిస్తోంది. ఇదిలా వుంటే `కేజీఎఫ్ 2` ఖాతాలో తాజాగా మరో రికార్డు వచ్చి చేరినట్టుగా చెబుతున్నారు. ఇంత వరకు ఈ చిత్రాన్ని దేశం మొత్తంలో 5 కోట్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారట. రాఖీ భాయ్ కోసం థియేటర్లకు వెళ్లారట. ఇది ఓ రికార్డుగా చెబుతున్నారు. అంతే కాకుండా ఈ రికార్డుని `ట్రిపుల్ ఆర్` కూడా టచ్ చేయలేకపోయిందని ట్రిపుల్ ఆర్ సాధించలేని రికార్డుని `కేజీఎఫ్ 2` సాధించిన ఔరా అనిపించిందని చెబుతున్నారు.

కేజీఎఫ్ 2ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యతో పోలిస్తే `ట్రిపుల్ ఆర్` ని థియేటర్లలో వీక్షించిన వారి సంఖ్య చాలా తక్కువ అని చెబుతున్నారు. కేజీఎఫ్ 2 దక్షిణాదిలో ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంతో ఉత్తరాదిలోనూ అదే స్థాయిలో ఎట్రాక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఈ తరహాలో అత్యధిక భాగం ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించిన సినిమాగా `కేజీఎఫ్ 2` రికార్డుని సృష్టించడం విశేషం. `కేజీఎఫ్ 2` సాధిస్తున్న రికార్డులని విశ్లేశిస్తున్న విమర్శకులు `చాప్టర్ 3` ఏ స్థాయిలో వుంటుందోనని అప్పుడే లెక్కలు వేస్తున్నారట.