భారీ స్థాయిలో ‘జగమే తంత్రం’ రిలీజ్.. గ్లోబల్ స్టార్ గా మారనున్న ధనుష్..!

Wed Jun 16 2021 11:00:05 GMT+0530 (IST)

Dhanush to become a global star

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘జగమే తంత్రం’. ధనుష్ గ్యాంగ్ స్టర్ సురలి పాత్రలో నటించిన ఈ సినిమా మరి కొన్ని గంటల్లో (జూన్ 18) ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. థియేటర్స్ లో అయితే తెలుగు తమిళ భాషల్లోనే అందుబాటులోకి వచ్చే ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కావడంతో భారీ రేంజ్ లో విడుదలకు సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ లో 17 భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం దాదాపు 190 దేశాల్లో స్ట్రీమింగ్ కానుండడం విశేషం. ఇప్పటికే హాలీవుడ్ లో అడుగుపెట్టిన పాన్ ఇండియా స్టార్ ధనుష్ కు.. ఈ సినిమా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టనుంది.ఇకపోతే ‘జగమే తందిరమ్’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు దాదాపు రూ.65 కోట్లు వరకు చెల్లించి తీసుకున్నారని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే సౌత్ నుంచి డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక ధర పలికిన చిత్రం ‘జగమే తంత్రం’ అవుతుంది. వాస్తవానికి థియేట్రికల్ రిలీజ్ కోసం చాలా కాలం ఎదురు చూసిన మేకర్స్.. పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో చివరకు డిజిటల్ రిలీజ్ కు మొగ్గుచూపారు. దీనిపై ధనుష్ మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. 190 దేశాల్లో విడుదల అవుతుందటంతో గ్లోబల్ రీచ్ ఉంటుందని ఓకే చెప్పాడని తెలుస్తోంది.

ధనుష్ కెరీర్లో వస్తున్న ఈ 40వ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. జేమ్స్ కాస్మో - కలై యారసన్ - జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చగా.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ 'జగమే తంత్రం' చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల 'కర్ణన్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్.. ఈ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.