ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబోలో పాన్ ఇండియా మూవీ.. రేపే అనౌన్సమెంట్?

Thu Jun 17 2021 21:07:15 GMT+0530 (IST)

Dhanush Shekhar Kammula Combo Pan India Movie

ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 'లవ్ స్టోరీ' సినిమాతో మూవీ ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణదాస్ కె నారంగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలానే అక్కినేని నాగార్జునతో పాటుగా పలువురు యువ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ అనౌన్సమెంట్ అంటూ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్రకటించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే అది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ గురించే అని వార్తలు వస్తున్నాయి.తమిళ హీరో ధనుష్ వైవిధ్యమైన సినిమాలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో బెస్ట్ యాక్టర్ రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్న ధనుష్.. హిందీ సినిమాలు కూడా చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ధనుష్.. ఎప్పటి నుంచో స్ట్రెయిట్ సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ వారు ఓ ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.

సునీల్ నారంగ్ నిర్మాణంలో ఓ పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు శేఖర్ కమ్ముల చాలా రోజులుగా చెబుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఏసియన్ వారు బిగ్ అనౌన్సమెంట్ ఉందని చెప్పడంతో ఇది ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్ గురించే అని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ను చూడొచ్చని చెప్పొచ్చు. సున్నితమైన ప్రేమకథలను చెబుతూ సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. మరోవైపు రా అండ్ రస్టిక్ సినిమాలతో తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు ధనుష్. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా అంటే ఆసక్తికరంగా ఉంది.

ధనుష్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శేఖర్ కమ్ములతో 'ఫిదా' 'లవ్ స్టోరీ' వంటి సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అలానే ధనుష్ తో కలిసి 'మారి 2' చిత్రంలో రౌడీ బేబీగా అదరగొట్టింది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ పాన్ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే రేపు (జూన్ 18) ఉదయం 9 గంటలకు శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.