Begin typing your search above and press return to search.

ధమాకా సాంగ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మాస్ రాజా..!

By:  Tupaki Desk   |   23 Sep 2022 1:05 PM GMT
ధమాకా సాంగ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మాస్ రాజా..!
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''ధమాకా''. 'డబుల్ ఇంపాక్ట్' అనేది దీనికి ట్యాగ్ లైన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ - 'జింతాక్' సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా 'మాస్ రాజా' అనే మరో పాటని విడుదల చేసారు.

'ఏ ఊరు వాడ ధూమ్ ధామ్ చెయ్యండ్రో.. పేపర్లో హెడ్ లైన్లు వెయ్యండ్రో.. బ్యానర్లు కటౌట్లు కట్టండ్రో.. డప్పు తియ్యండ్రో.. దరువు వెయ్యండ్రో..' అంటూ సాగిన ఈ మాస్ రాజా పాట ఫ్యాన్స్ ని అలరిస్తోంది. మాస్ మహారాజా తనదైన శైలిలో వేసిన ఎనర్జిటిక్ మాస్ డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట థియేటర్లలో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తుందనే భావన కలిగిస్తోంది.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ కు మంచి మాస్ బీట్ ని కంపోజ్ చేయగా.. రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా సింగర్ నకాస్ అజిజ్ ఎంతో హుషారుగా ఆలపించారు. 'బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా.. బీసీ సెంటర్లలో మోగాలి తాలియా..' అంటూ రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు. యష్ మాస్టర్ ఈ మాస్ సాంగ్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహించగా.. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు సమకూర్చారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'ధమాకా' సినిమా దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.