కమల్ హాసన్ సినిమా టైటిల్ తో వస్తున్న దేవరకొండ బ్రదర్..!

Mon Mar 01 2021 11:36:10 GMT+0530 (IST)

Devarakonda Brother is coming with Kamal Haasan movie title ..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'దొరసాని' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తన రెండో చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తో మంచి హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో తన అన్న ప్రొడక్షన్ లో ఆనంద్ సైలెంటుగా మూడో సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. "పుష్పక విమానం" అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాతో దామోదర అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇందులో శాన్వి మేఘన - గీత్ సాయిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ - విజయ్ దషి - ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు.'పుష్పక విమానం' ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో ఆనంద్ దేవరకొండతో పాటు హీరోయిన్లు శాన్వి మేఘన - గీత్ సాయిని - సీనియర్ నరేష్ - సునీల్ - గిరి - కిరీటి కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఇది పెళ్లి నేపథ్యంలో  ఉండే కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు రామ్ మిరియాల - సిద్దార్థ్ సదాశివుని - అమిత్ దాసాని మ్యూజిక్ అందిస్తున్నారు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నీల్ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ.. ''న్యూస్ లో ఓ కథనం చూసి ఇన్స్పైర్ అయి దానికి నిజ జీవిత క్యారెక్టర్స్ ని జోడించి ఈ కథని తయారు చేసుకున్నాను. ఇది మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేస్తారు" అని తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కమల్ హాసన్ - అమల హీరోహీరోయిన్లుగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో 'పుష్పక విమానం' అనే ప్రయోగాత్మక చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు అదే టైటిల్ తో రాబోతున్న దేవరకొండ బ్రదర్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.