ఇప్పుడు మార్కెట్ లో యాంకర్ కమ్ యాక్టర్స్ కు ఫుల్ డిమాండ్..!

Wed Jun 29 2022 05:00:01 GMT+0530 (IST)

Demand in Films For Anchors come Actors

బుల్లితెర మీద యాంకర్లుగా రాణించిన చాలామంది ముద్దుగుమ్మలు.. వెండితెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. టీవీ కార్యక్రమాలతో ఎక్కువమంది అభిమానులను గెలుచుకున్న కొందరు.. సినిమాల్లోనూ మంచి ఆదరణ పొందారు.యాంకరింగ్ మరియు యాక్టింగ్ రెండింటినీ మేనేజ్ చేయగల టీవీ రియాలిటీ షో యాంకర్లకు పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. వీరంతా చిన్న చిన్న ప్రచార కార్యక్రమాల కోసం లక్షల్లో వసూలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

అగ్ర దర్శకనిర్మాతలు సైతం వీరినిఎంకరేజ్ చేస్తున్నారు. ఆఫర్స్ అందిస్తున్నారు. అనసూయ భరద్వాజ్ - రష్మీ గౌతమ్ - హరితేజ - శ్రీముఖి వంటి యాంకర్ కమ్ యాక్టర్స్ ని ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ఒకప్పుడు 'మా' టీవీలో కలర్స్ అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరించిన స్వాతి.. తన చాలకీ మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లపాటు తెలుగు తమిళ భాషల్లో నటించిన స్వాతి రెడ్డి.. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.

ఒకప్పుడు యాంకర్లుగా సత్తా చాటిన ఝాన్సీ - ఉదయభాను వంటి వారు సినిమాల్లోనూ నటించారు. ఝాన్సీ క్యారక్టర్ ఆర్టిస్టుగా పాపులారిటీ తెచ్చుకోగా.. ఉదయ భాను మాత్రం కొన్ని చిత్రాలకే పరిమితమైంది. ప్రముఖ యాంకర్ సుమ ఇటీవల 'జయమ్మ పంచాయితీ' మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్.. బిగ్ స్క్రీన్ పై కూడా హవా కొనసాగిస్తోంది. 'క్షణం' 'సోగ్గాడే చిన్నినాయనా' 'రంగస్థలం' 'పుష్ప' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయినప్పటికీ తనకు గుర్తింపు తీసుకొచ్చిన యాంకరింగ్ ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికీ కొన్ని షోలతో టీవీలలో కనిపిస్తూనే ఉంది.

యాంకర్ రష్మీ గౌతమ్ కూడా వెండితెరపై అందాలు ఒలకబోస్తోంది. ఓవైపు టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో అదరగొడుతోంది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన రష్మీ.. ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాతో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన 'బొమ్మ బ్లాక్ బ్లాస్టర్' మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది

బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి.. అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది. 'జులాయి' 'జెంటిల్ మ్యాన్' వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 'బిగ్ బాస్' రియాలిటీ షోలో రన్నరప్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటికొచ్చాక హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంది. ‘క్రేజీ అంకుల్స్’ అనే మూవీ తో పలకరించిన శ్రీముఖి.. 'ఇట్స్ టైమ్ టు పార్టీ' చిత్రంతో రాబోతోంది.

సీరియల్స్ లో నటించి 'బిగ్ బాస్' రియాలిటీ షో తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న హరితేజ.. ఇప్పుడు సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. 'దమ్ము' 'అ ఆ' 'అరవింద సమేత' 'రాజా ది గ్రేట్' 'ఎఫ్ 2' '118' 'సరిలేరు నీకెవ్వరు' 'హిట్' 'జాంబిరెడ్డి' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి 'భోళాశంకర్' చిత్రంలో కనిపించబోతోంది.

ఇలా బుల్లితెర మీద రాణించిన వారిని సినిమాల్లోకి ఆహ్వానిస్తున్నారు. టీవీ కార్యక్రమాల్లో అదరగొట్టిన వీరంతా బిగ్ స్క్రీన్ కూడా చక్కని నటనతో ఆకట్టుకుంటున్నారు. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.