డిసెంబర్ సినీ వినోదం..!

Fri Nov 26 2021 15:00:39 GMT+0530 (IST)

December Movie Entertainment

కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో ఎప్పటిలాగే సినిమాల సందడి మొదలైంది. చిన్నవో పెద్దవో వారానికో అర డజను చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈరోజు శుక్రవారం కూడా 'అనుభవించు రాజా' 'క్యాలీఫ్లవర్' 'ది లూప్' తో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇదే క్రమంలో వచ్చే నెలలో కొన్ని పెద్ద సినిమాలు.. మరికొన్ని క్రేజీ మూవీస్ రాబోతున్నాయి.నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న 'అఖండ' చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న పెద్ద సినిమా ఇది. అదే రోజు మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరక్కార్' మూవీ రాబోతోంది. దీని తర్వాత 4వ తేదీన నిత్యా మీనన్ 'స్కైలాబ్' సినిమా రాబోతోంది. డిసెంబర్ 10న నాగశౌర్య 'లక్ష్య' - కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖీ' లతో పాటుగా 'మడ్డీ' అనే మల్టీలాంగ్వేజ్ సినిమా విడుదలకు రెడీ అయ్యాయి.

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ నుంచి థియేటర్లలోకి వస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. అదే డేట్ కి హాలీవుడ్ మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' థియేటర్లలోకి రాబోతోంది. దీని తర్వాత క్రిస్మస్ సందర్భంగా నాని పాన్ సౌత్ ఇండియా సినిమా 'శ్యామ్ సింగ రాయ్' రిలీజ్ అవుతుంది. పోటీగా వరుణ్ తేజ్ 'గని' సినిమా వస్తున్నట్లు ప్రకటించారు కానీ.. ఇప్పుడు వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారని టాక్.

'గని' సినిమా రాకపోయినా నాని సినిమాతో పాటుగా కపిల్ దేవ్ '83' మూవీ కూడా వస్తుంది. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన సినిమా కావడం గమనార్హం. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ సినిమాలు.. చిన్న సినిమాలు థియేటర్లలో రావడానికి రెడీ అయ్యాయి. అంటే డిసెంబర్ నెల దాదాపు పది సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ సినిమాలలో ఏవి ప్రేక్షకాదరణ దక్కించుకొని మంచి వసూళ్ళు రాబడతాయో చూడాలి.