'డియర్ మేఘ' టీజర్: భావోద్వేగాలు కలబోసిన అందమైన ఆసక్తికరమైన ప్రేమకథ

Thu Jul 22 2021 11:20:39 GMT+0530 (IST)

Dear Megha Teaser Talk An Emotional Rollercoaster Of Love!

మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం ''డియర్ మేఘ''. సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ - ఇతర పోస్టర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే 'ఆమని ఉంటే పక్కన' లిరికల్ సాంగ్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డియర్ మేఘ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.'హాయ్.. నేను మేఘ స్వరూప్. నాకు లవ్ లో పీహెడ్డీ ఉంది' అంటూ మేఘా ఆకాష్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనుకునే విధంగా ఈ టీజర్ కట్ చేశారు. అలానే ఇది కన్నడ హిట్ సినిమా 'దియా' రీమేక్ అనే సందేహం కలుగుతోంది. 'కాలేజీలో ఉన్నప్పుడు ఒక్కసారైనా నన్ను చూసావా?' అని హీరో అడుగగా.. 'నిన్ను చూసినన్ని సార్లు బుక్స్ చూసి ఉంటే కాలేజ్ టాపర్ అయ్యుండే దాన్ని' అని హీరోయిన్ నుంచి సమాధానం వస్తుంది.

'లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకడం కాదు.. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బ్రతకడం' 'అతి ఎక్కువ సంతోషానికైనా బాధకైనా కారణం ప్రేమే అవుతుంది' వంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. 'స్టోరీలకు ముగింపు ఉంటుంది.. లవ్ స్టోరీలను ఉండదు' అని చెబుతున్న 'డియర్ మేఘ' టీజర్ అలరిస్తోంది. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం సమకూర్చారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.

'డియర్ మేఘ' చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. భావోద్వేగాలు కలబోసిన ఈ అందమైన ఆసక్తికరమైన ప్రేమకథ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.