తెలుగు ఇండస్ట్రీలో పెరుగుతూనే ఉన్న కేసులు

Mon Jul 13 2020 10:30:26 GMT+0530 (IST)

Dangerous Disease Cases are rise in the Telugu industry

తెలుగు బుల్లి తెర నటీనటులు ఇంకా సాంకేతిక నిపుణులను కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు బుల్లి తెరకు చెందిన స్టార్స్ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. తాజాగా మరో నటుడు కూడా తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందనే విషయాన్ని ఒక వీడియో ద్వారా ప్రకటించాడు. స్వాతి చినుకులు మరియు బంధం వంటి సీరియల్స్ లో కీలక పాత్రల్లో కనిపించిన నటుడు భరద్వాజ్ ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చిందట. దాంతో ఆయన సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశాడు.గత రెండు వారాలుగా స్వాతిచినుకులు మరియు బంధం సీరియల్స్ లో నాతో కలిసి నటించిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి పరీక్షలు చేయించుకోండి. ఇది ఏమీ ఆందోళన కలిగించే విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ గా ఉండాలి. రహస్యంగా దాచి పెట్టడం వల్ల ప్రమాదం మరింతగా పెరుగుతుంది. పాజిటివ్ అంటూ తెలిసిన వెంటనే భయాందోళనకు గురి అవ్వాల్సిన పని లేదు. మెడిటేషన్ చేయడంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్ల కరోనా నుండి ఈజీగానే బయట పడవచ్చు.

జాగ్రత్తలు పాటిస్తూ సామాజిక దూరంను పాటించడం వల్ల వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే మీరు ఇతరులకు వైరస్ అంటించని వారు అవుతారు. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తనకు ఏ విధంగా వైరస్ అంటి ఉండవచ్చు అనే విషయాన్ని చెప్పలేనన్నాడు. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఈజీగా సోకే ప్రమాదం ఉందని కనుక జాగ్రత్తలు పాటించడం మంచిదనే అభిప్రాయంను భరద్వాజ్ వ్యక్తం చేశాడు.