`కెప్టెన్` విజయ్ కాంత్ భార్యకు కరోనా

Tue Sep 29 2020 22:40:14 GMT+0530 (IST)

DMDK chief Vijayakanth wife Premalatha tests positive

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతోపాటు అధికారులు ప్రజాప్రతినిధులు సినీ తారలు కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవలే తమిళ నటుడు డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతుండగా 5 రోజుల క్రితం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. చెన్నైలోని  ఎమ్ఐఓటీ ఇంటర్నేషనల్ హాస్పటల్ లో విజయ్ కాంత్ చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత  విజయ్ కాంత్ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ కాంత్ సతీమణి ప్రేమలతకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విజయ్ కాంత్ కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలోనే ప్రేమలతను జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆ దంపతులిద్దరికీ ఒకే వార్డులో చికిత్స అందిస్తున్నారు.గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి తర్వాత సినీ తారలు సెలబ్రిటీలకు కరోనా సోకిందన్న వార్తలపై మీడియా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. బాలు మరణం తర్వాత విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై కూడా పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు చికిత్స అందిస్తున్న ఎమ్ఐఓటీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. విజయ్ కాంత్ ఆరోగ్యం విషయంలో కంగారు పడాల్సిన పని లేదని ఆయనకు ఆయన భార్యకు ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే విజయ్ కాంత్ దంపతులు ఆసుపత్రిలో చేరారని అన్నారు. మరో 5 రోజుల్లో విజయ్ కాంత్ డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని విజయ్ కాంత్ పై వస్తున్న ఎలాంటి పుకార్లు నమ్మొద్దని తెలిపారు.