ఇండస్ట్రీ డీన్ డి.సురేష్ బాబుకి టోకరా వేసిన బడా బాబులెవరో!

Tue Jul 27 2021 08:00:01 GMT+0530 (IST)

The future is digital Exhibition speed may decrease

మూవీ మోఘల్ డా.డి.రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుని నిర్మాతగా డిస్రిబ్యూటర్ గా ఎగ్జిబిటర్ గా డి.సురేష్ బాబు టాలీవుడ్ లో  అగ్ర పథాన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.  సినీ స్టూడియోల నిర్వహణతో పాటు థియేట్రికల్ బిజినెస్ లోనూ గొప్పగా విశ్లేషించగల నిర్మాత ఆయన.. డిజిటల్ రంగ ప్రవేశం తర్వాత అడ్వాన్స్ డ్ స్టేజ్ ఎలా ఉంటుందో సినిమా భవిష్యత్ ఎలా ఉండబోతోందో కూడా చాలా ముందుగా విశ్లేషించిన ఘనుడు.కరోనా పర్యవసానాలు ఎగ్జిబిషన్ ని అతలాకుతలం చేయడం ఖాయమన్న మొదటి నిర్మాత కూడా ఆయనే. నవతరం  ప్రతిభను ప్రోత్సహించడంలో రామానాయుడు తరహాలోనే సురేష్ బాబు ముందుంటారు. ఇక వివాదాలకు సురేష్ బాబు ఎప్పుడూ దూరమే.

తన పని తాను చేసుకుపోవడం తప్ప ఇతర విషయాల్లో వేలు పెట్టరు. సమస్య తన వరకూ వచ్చినా ఎంతో సానుకూలంగా పరిష్కరించుకునే వ్యక్తిత్వం గలవారు. ఇండస్ట్రీ తరుపున ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపడంలో కూడా సురేష్ బాబు ఎంతో చొరవ చూపిస్తుంటారు.  ఇంతటి దిగ్గజ నిర్మాతకే పరిశ్రమ సహా పరిశ్రమతో  ముడిపడిన బయట వ్యక్తలు చాలా మంది ఆయనకు చాలాసార్లు టోకరా వేసినట్లు చెప్పుకొచ్చారు. రూపాయి ఖర్చు చేయడం వెనుక ఆయన వంద  కారణాలు ఉంటాయని.. కాస్త పిసినారి అనే కామెంట్లు కూడా ఆయనపై గతంలో వచ్చాయి. అయితే తాజాగా ఆయన మాటలు వింటే విస్తు పోవాల్సిందే.

ఇండస్ట్రీలో చాలా మంది ఆయన దగ్గర నుంచి అప్పుల రూపంలో ఇతర మార్గాల ద్వారా చాలా డబ్బు తీసుకున్నట్లు తెలిపారు. అందులో డబ్బున్న బడా బాబులు కూడా ఉన్నారుట. ఆ లిస్టే తీస్తే చాలా మంది పేర్లు బయటకి వస్తాయని పేర్కొన్నారు. సినిమాలు నిర్మిస్తామని పంపిణీ   కోసమని.. సినిమా పైనాన్స్ కోసమని ఇలా కొంత మంది సురేష్ బాబు దగ్గర డబ్బులు తీసుకున్నారుట. ఇప్పటివరకూ చాలా మంది తిరిగి ఇవ్వలేదని  అసహనం వ్యక్తం చేసారు.

డబ్బులుండి కూడా తిరిగి ఇవ్వని వాళ్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు.  సినిమా తీసి నష్టం వచ్చి అప్పుల్లో కూరుకుపోయినవాడు ఇవ్వలేదంటే అందులో  ఓ అర్ధం కనిపిస్తుంది. కానీ గల్లా నిండిన వాళ్లు కూడా ఇలా చేస్తే ఎలా?  అంటూ ప్రశ్నించారు.  అలాగే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్లు ఎంత మాత్ర ఆమోదయోగ్యంగా లేవన్నారు.  మీడియం రేంజ్ ధరలను పెంచాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఓటీటీల్లో తమ సినిమాల్ని రిలీజ్ చేయడం సరైనదేననే అభిప్రాయం మునుపటి ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన సంగతి తెలిసినదే.

భవిష్యత్ డిజిటల్ దే.. ఎగ్జిబిషన్ స్పీడ్ తగ్గొచ్చు

డి.సురేష్ బాబు టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ పై విశ్లేషిస్తూ  చాలా సంగతులే చెప్పారు. టాలీవుడ్ లో ప్రతియేటా తెరకెక్కే 150 సినిమాలే కాదు.. బోలెడన్ని అవకాశాలు పెరుగుతున్నాయి. డిజిటల్ సిరీస్ లు.. వెబ్ సిరీస్ లు పెరుగుతున్నాయి. పని చేసుకునే కార్మికులకు వీటివల్ల అవకాశాలు పెరుగుతాయి. నటీనటులకు టెక్నీషియన్లకు పని అవకాశం పెరుగుతుంది. అలాగే నిర్మాతలకు ఇవి చాలా ఉపయుక్తం.. ఓటీటీలతో చాలా మేలు జరుగుతోంది... అని తెలిపారు.

ఇక ఓటీటీలతో పాటు మనుగడ సాగించగలిగేది సూపర్ స్క్రీన్లు మాత్రమేనని ఇటీవల ఆయన తెలిపారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఇకపై మినీ స్క్రీన్లు అల్ట్రా సౌండ్ సిస్టమ్ తో అందుబాటులోకి వచ్చేస్తాయని సినిమా వీక్షణ విధానం అమాంతం మారిపోతుందని తెలిపారు. బ్యాంకుల్లో బిజినెస్ మోడల్ మారుతోంది. అక్కడికి కస్టమర్లను ఆకర్షించేందుకు విధిగా సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేస్తారని ముందస్తు ఆలోచనను ఆవిష్కరించారు.

ఇక ఓటీటీలను సమర్థించినా కానీ ఎగ్జిబిషన్ రంగం గురించి ఆయనేమీ తక్కువ చేసి మాట్లాడలేదు. ఈ రంగంలో కష్టాలను ఆయన ఏకరువు పెట్టారు. అసలు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం లేదని నిర్వేదం వ్యక్తం చేశారు. 15 నెలలుగా మూతపడి ఉన్న థియేటర్లకు ఎగ్జిబిటర్లకు ప్రభుత్వాల సాయం చాలా అవసరం అన్నారు.. టిక్కెట్ రేట్లు పెంచాలని అడిగాం.. కరెంట్ బిల్స్ పన్నులు తగ్గించాలని కోరాం. కానీ స్పందన లేదన్నారు.

ఇప్పటికే సింగిల్ స్క్రీన్లు ఫ్యాషన్ తో నడిపేవాళ్లే. కమర్షియల్ చేయాలనుకుంటే ఎప్పుడో బిజినెస్ చేసేవారు. థియేటర్లన్నీ నిజానికి ప్రైమ్ ఏరియాలో రోడ్స్ ఉన్న ఏరియాలో ఉంటాయి. కానీ థియేటర్ యజమానులు వీటిని ఫ్యాషన్ కోసం నడిపిస్తున్నారు తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు.. అక్కడ  వేరే వ్యాపారాలు చేయొచ్చని అన్నారు. ఇకపై హై క్వాలిటీ థియేటర్లు మాత్రమే సర్వైవ్ అవతాయి. సూపర్ స్క్రీన్లు మాత్రమే రన్ అవుతాయి. తక్కువ క్వాలిటీ థియేటర్లు ఉండవు.. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలు సైమల్టేనియస్ గా ముందుకు సాగుతాయి... అని తనదైన శైలిలో విశ్లేషించారు.