Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : డి కంపెనీ

By:  Tupaki Desk   |   15 May 2021 11:52 AM GMT
మూవీ రివ్యూ : డి కంపెనీ
X
చిత్రం : ‘డి కంపెనీ’

నటీనటులు: అశ్వత్ కాంత్-నైనా గంగూలీ-రుద్ర్ కాంత్-ఐరా మోర్-అభిలాష్ చౌదరి-హేరంబ్ త్రిపాఠి-వినోద్ ఆనంద్-రాకీ మహాజన్ తదితరులు
సంగీతం: పాల్ ప్రవీణ్
ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి
రచన: హరీష్ ఎం.కొఠియన్-రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: సాగర్ మాచనూరు
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

గత ఏడాది కరోనా కారణంగా మొదలై ఓటీటీల హవా మొదలయ్యాక డిజిటల్లో నేరుగా అత్యధిక చిత్రాలు విడుదల చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మదే. ఏడాది వ్యవధిలో అరడజను సినిమాలకు పైగానే ఇలా రిలీజ్ చేసిన వర్మ.. ఇప్పుడు తనకు మంచి పట్టున మాఫియా జానర్లో దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘డి కంపెనీ’ని ‘స్పార్క్’ అనే కొత్త ఓటీటీలోకి దించాడు. గత కొన్నేళ్లలో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పతనాన్ని చూస్తున్న ప్రేక్షకులు ఆయన్నుంచి వచ్చే సినిమాలను నెమ్మదిగా పట్టించుకోవడం మానేస్తున్నారు కానీ.. వర్మ దర్శకత్వంలో ఓ మాఫియా సినిమా, పైగా దావూద్ ఇబ్రహీం జీవిత కథ అనేసరికి కొంత ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితోనే ‘డి కంపెనీ’పై ఓ లుక్కేస్తే..?

ఇండియన్ ఫిలిం హిస్టరీలో మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే చిత్రాల కోసమే ఒక జానర్ అంటూ క్రియేట్ చేసి పెట్టిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ. సత్య.. కంపెనీ.. సర్కార్ లాంటి చిత్రాలతో అతను సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక క్రైంతో ముడిపడ్డ వేరే నిజ జీవిత కథలను కూడా గొప్పగా మలిచిన ట్రాక్ రికార్డు వర్మకు ఉంది. ‘రక్తచరిత్ర’ లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. మరి మాఫియా నేపథ్యంలో ఒక నిజ జీవిత కథను వర్మ తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ అది ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద మాఫియా డాన్లలో ఒకడిగా పేరు తెచ్చుకుని.. ఇండియాలో కోట్లాదిమందికి కునుకు లేకుండా చేసిన దావూద్ ఇబ్రహీం కథ అయితే ఇంకెంత ఆసక్తి ఉంటుంది? గత కొన్నేళ్లలో వర్మ తీసిన మిగతా సినిమాల సంగతెలా ఉన్నప్పటికీ.. ఈ సినిమాలో మాత్రం ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుందని అనుకుంటాం. ఐతే వర్మకు ఇన్నాళ్లూ తిరుగులేదనుకుంటూ వచ్చిన అంశాల మీదా పట్టు కోల్పోయాడని చాటుతుంది ‘డి కంపెనీ’. కల్పిత గాథలతో అద్భుతాలు చేసిన వర్మ.. వరల్డ్ ఫేమస్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మీద తీసిన చిత్రంలో ఒకప్పటి తన ప్రమాణాలను ఎంతమాత్రం అందుకోలేకపోయాడు.

గత కొన్నేళ్ల వర్మ ట్రాక్ రికార్డును బట్టి ఆయన మీద ఎంత అంచనాలు తక్కువ పెట్టుకున్నప్పటికీ.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కథ అన్నాక ఒకప్పుడు వర్మ తీసిన సత్య.. కంపెనీ.. లాంటి సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో మెదలక మానవు. మాఫియా గురించి తాను పరిశోధించి తెలుసుకున్న సంచలన విషయాలను గుదిగుచ్చి.. అద్భుతమైన స్క్రీన్ ప్లేలతో ఆద్యంతం ఆ చిత్రాలను రక్తి కట్టించిన వర్మ.. ఇప్పుడు మాత్రం ఆ నైపుణ్యాన్ని పూర్తిగా కోల్పోయాడని ‘డి కంపెనీ’ మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. దావూద్ నిజ జీవిత కథ అనగానే మనకు తెలియని ఎన్నో సంచలన విషయాలు చూడబోతున్నాం అనుకుంటూ ఒక ఉత్కంఠతో మొదలుపెడితే.. ఆరంభంలో కాస్త మెరుపులు మెరిపించి ఆ తర్వాత మాఫియా డాన్‌ గా దావూద్ కథ మొదలవడానికి బీజం ఎక్కడ పడిందో చూపించే ఆరంభ సన్నివేశం ఒకటి కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. దావూద్ పాత్రను చాలా మామూలుగా పరిచయం చేసిన వర్మ.. ఏదైనా సంచలన ఉదంతాన్ని చూపించి అతడి పాత్రను ఎలివేట్ చేస్తాడని ఎదురు చూస్తాం. కానీ వాస్తవంగా ఏం జరిగిందో ఏమో కానీ.. ‘డి కంపెనీ’లో మాత్రం దావూద్ పాత్ర చాలా చప్పగా సాగిపోతుంది. ఎక్కడా ఉత్సాహం రేకెత్తించదు. దావూద్ ఎలాంటి వాడు.. ఎలాంటి పనులు చేశాడు అన్నది పక్కన పెడితే.. సినిమాలో ప్రధాన పాత్ర సందర్భానుసారంగా రైజ్ అవ్వాలని.. సంచలనంగా ఏదైనా చేయాలని కోరుకుంటాం. కానీ గంటన్నర నిడివి ఉన్న ‘డి కంపెనీ- పార్ట్ 1’లో ఈ పాత్ర చాలా వరకు స్తబ్దుగా ఉంటుంది. ఒక్క పతాక సన్నివేశంలో మాత్రమే కాస్త తన ఉనికిని చాటుకుంటుంది. ప్రధాన పాత్రే చల్లబడిపోతే ఇక ఉత్సాహం ఎక్కడొస్తుంది?

‘డి కంపెనీ’తో ఉన్న మరో ప్రధాన సమస్య.. ఈ కథలో ఎక్కడా సామాన్య ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం. ‘రక్త చరిత్ర’ తరహాలో ‘డి కంపెనీ’ని రెండు భాగాలుగా తీయాలనుకున్నాడన్న సంగతి సినిమా చివరికి కానీ తెలియదు. వరల్డ్ ఫేమస్ మాఫియా డాన్ గా అతడి ఎదుగుదల.. ఉగ్రవాదులతో చేతులు కలిపి అతను చేసిన కార్యకలాపాలు.. సామాన్య ప్రజలపై ప్రభావం చూపిన అతడి అరాచకాలు.. ఇవన్నీ కూడా రెండో పార్ట్ కోసం దాచుకున్నాడో ఏమో కానీ.. ‘డి కంపెనీ’ ఫస్ట్ పార్ట్ లో చూపించిందంతా 80వ దశకంలో ముంబయిని గుప్పెట్లో ఉంచుకుని గ్యాంగుల మధ్య అంతర్గత కలహాలే. ముందు రెండు గ్యాంగులు కలిసి పని చేయడం.. అందులో విభేదాలు తలెత్తి ఇద్దరూ వేరు కుంపట్లు పెట్టుకోవడం.. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ.. ఒక గ్యాంగ్ మీద ఇంకో గ్యాంగ్ కుట్ర.. ప్రతిగా ఆ గ్యాంగ్ ప్రతీకారం.. ఇదీ స్థూలంగా ‘డి కంపెనీ’ తొలి భాగంలో మనం చూసే కథ. ఎక్కడా కూడా కాస్తయినా కొత్తదనం కనిపించదు. అలాగేు కథ సామాన్య ప్రజలతో కానీ.. సొసైటీతో కానీ ముడిపడి ఉండదు. టార్గెట్ చేసిన వ్యక్తులను చంపేటపుడు జరిగే ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ కు సంబంధించి వర్మ సినిమాల్లో ఎప్పుడో అద్భుతమైన సన్నివేశాలు చూశాం. ఇక ‘డి కంపెనీ’లో కొత్తగా చూసి ఆశ్చర్యపోవడానికి ఏమీ లేకపోయింది. సినిమా మొత్తం గన్నులు.. కాల్పులు.. ఒకరి మీద ఒకరి ఎటాక్స్. అంతే తప్ప.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి ఇందులో కనిపించదు.

నిజ జీవిత కథలతో సినిమాలు తీసినపుడు వర్మ మామూలుగా ప్రధాన పాత్రలకు సరిపోయేలా భలేగా నటులను ఎంచుకుంటూ ఉంటాడు. వాళ్ల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ కూడా రాబట్టుకుంటూ ఉంటాడు. ఐతే ‘డి కంపెనీ’కి సంబంధించి ఈ విషయంలోనూ విఫలమయ్యాడనిపిస్తుంది. దావూద్ ఇబ్రహీం పాత్రలో అశ్వత్ కాంత్ అంత యాప్ట్ గా అనిపించడు. దావూద్ అనగానే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇంటెన్సిటీని అశ్వత్ చూపించలేకపోయాడు. పాత్ర బలహీనంగా కనిపించడం కూడా అశ్వత్ ఎలివేట్ కాకపోవడానికి ఒక కారణం కావచ్చు. దావూద్ అన్నగా సాబిర్ పాత్రలో కనిపించిన నటుడు పూర్తిగా తేలిపోయాడు. ఇంతకుముందులా వర్మను నమ్మి ఆర్టిస్టులు రావట్లేదా.. లేక వర్మ సరైన నటులను ఎంచుకోవడంలో విఫలమవుతున్నాడా అన్నది తెలియదు కానీ.. కాస్టింగ్ పరంగా ఒకప్పటి ఆర్జీవీ మాఫియా సినిమాల స్టాండర్డ్స్ ఇందులో కనిపించలేదు. లేడీ క్యారెక్టర్లలో కనిపించిన నైనా గంగూలీ.. ఐరా మోర్ ల గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. సమద్ ఖాన్ పాత్రలో కనిపించిన నటుడు ఓకే. మిగతా వాళ్లంతా మామూలే. అప్సరా రాణి ఒక పాటలో వీలైనంతగా అందాలు ఆరబోసింది. పాల్ ప్రవీణ్ సంగీతం.. మల్హర్ భట్ జోషి ఛాయాగ్రహణంలో కొత్తదనం ఏమీ కనిపించదు. వర్మ సినిమాల్లో ఎప్పుడూ కనిపించే సౌండ్స్.. విజువల్సే ఇందులోనూ వింటాం.. చూస్తాం. నిర్మాణ విలువలు అంత గొప్పగా ఏమీ కనిపించవు. చాలా వరకు ఇండోర్ లో సన్నివేశాలు లాగించేసి.. కలర్ ప్యాటర్న్ మార్చడం ద్వారా ఏదో మేనేజ్ చేశారు కానీ.. 80ల నాటి ముంబయి వాతావరణాన్ని పెద్దగా ఫీల్ కాలేం. ‘డి కంపెనీ-2’లో వర్మ ఏదైనా మ్యాజిక్ చేస్తే చెయ్యాలి కానీ.. తొలి భాగంలో మాత్రం ఆయన పూర్తిగా నిరాశ పరిచాడు. ఎంత తక్కువ అంచనాలతో చూసినా కూడా ఇది ప్రేక్షకులను నిరాశకే గురి చేస్తుంది.

చివరగా: డి కంపెనీ- వర్మ మ్యాజిక్ మిస్

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre